Shyam Singha Roy: "'శ్యామ్ సింగరాయ్' లాంటి చిత్రాలు రావాలంటే.. బడ్జెట్ విషయంలో రాజీ పడని నిర్మాతలే ఉండాలి. అప్పుడే మంచి అవుట్‌పుట్‌ను అందించగలుగుతాం" అన్నారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల. ఈ సినిమా కోసం 70వ దశకం నాటి బంగాల్ పరిస్థితులను పునఃసృష్టించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. అందుకే ఈ చిత్ర ప్రయాణం ఎంతో ప్రత్యేకమని చెప్పారు అవినాష్. నాని కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన చిత్రమే 'శ్యామ్ సింగరాయ్'. వెంకట్ బోయనపల్లి నిర్మించారు. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు అవినాష్.
"ఈ చిత్రంలో రెండు కథలుంటాయి. ఒకటి వర్తమానంలో జరుగుతుంటుంది. ఇంకొకటి 70ల కాలం నాటి బంగాల్ నేపథ్యంలో సాగుతుంటుంది. ఈ నేపథ్యమే సినిమా పట్ల నాకు ఆసక్తిని పెంచింది. నిజానికి తెలుగులో కోల్‌కతా నేపథ్యంలో వచ్చిన కథలు తక్కువే. అప్పట్లో 'చూడలని ఉంది' వచ్చినా.. 70ల నాటి నేపథ్యాన్ని చూపించిన వారు లేరు. అందుకే అప్పటి పరిస్థితుల్ని చూపించేందుకు మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. అక్కడి ఇళ్లు, ఆలయాలు ఎలా ఉంటాయి.. వాటి ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది? అన్నది తెలుసుకోవడం కోసం మూడేళ్ల పాటు రీసెర్చ్ చేశాం. లాక్‌డౌన్ సమయంలో బంగాల్‌లోనే ఉండిపోయాం."
-అవినాష్ కొల్ల, ప్రొడక్షన్ డిజైనర్
- "ఈ చిత్రం కోసం అన్ని సెట్లు హైదరాబాద్‌లోనే వేశాం. ట్రైలర్‌లో కనిపించిన ప్రింటింగ్ ప్రెస్ కోసం చాలా శ్రమించాం. అప్పుడు వాడిన పేపర్, టెక్ట్స్.. ఇలా అన్నింటి గురించి తెలుసుకొని వాటిని రీక్రియేట్ చేశాం. ఈ సినిమా కోసం వేసిన సెట్లలో అతి పెద్దది కాళీమాత టెంపుల్ సెట్. ఇదే చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో.. మూడు నెలల పాటు శ్రమపడి ఈ సెట్ నిర్మించాం. దేవదాసీలకు సంబంధించిన టెంపుల్ ఎలా ఉంటుందనేది ఊహిస్తూ.. కథకు తగ్గట్లుగా నిర్మించాం. సినిమాలో 30శాతానికి పైగా మేజర్ సీక్వెన్స్ ఈ సెట్‌లోనే చేశారు. కరోనా సమయంలో వచ్చిన తుపానుల వల్ల సెట్‌లు చాలా వరకు దెబ్బ తిన్నాయి. కానీ, మళ్లీ చిత్రీకరణ పునఃప్రారంభమయ్యే నాటికి వాటిని తిరిగి రెడీ చేశాం."
- "టెంపుల్ సెట్‌ను ఇండస్ట్రీలో చాలా మంది చూశారు. ఇంత డీటైలింగ్ ఎందుకు వేశారు. దర్శకుడు చెప్పారని వేశారా? మీరు వేశారని దర్శకుడు తీశారా? అనే అనుమానాలు అందరికీ వచ్చాయి. ఈ చిత్ర విషయంలో నిర్మాత వెంకట్ ఎక్కడా రాజీ పడలేదు. ఎంత ఖర్చు చేస్తున్నారు.. ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఇలాంటి చిత్రాలకు అలాంటి నిర్మాతలే అవసరం. ప్రస్తుతం నేను నాని 'దసరా', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాలకు ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నా. ఇప్పటికే ఆయా చిత్రాలకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. నిర్మాతగా 'బృందా' (వర్కింగ్ టైటిల్) అనే వెబ్‌సిరీస్ చేస్తున్నా. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్.. త్వరలో సోనీ లివ్‌లో విడుదల కానుంది."
ఇవీ చూడండి:
'శ్యామ్ సింగరాయ్' అందుకే మరింత స్పెషల్: నాని
Sirivennela: 'సిరివెన్నెల' చివరిగీతం విడుదల.. 'శ్యామ్ సింగరాయ్'లో..