అమెరికన్ నటి, పాప్ గాయని స్కార్లెట్ జాన్సన్ ప్రపంచంలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా పేరుపొందింది. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో మెుదటి స్థానంలో నిలిచిందీ హాలీవుడ్ నటి. ఈ లిస్టు తయారీ కోసం గతేడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 1 వరకు కాలంలో సంపాదనను పరిగణనలోకి తీసుకుంది ఫోర్బ్స్ పత్రిక. 56 మిలియన్ డాలర్ల సంపాదనతో టాప్ స్థానంలో నిలిచిందీ అమ్మడు.
ఈ ఏడాది వేసవిలో విడుదలైన మార్వెల్ సినిమా 'అవెంజర్: ద ఎండ్‌గేమ్'లో నటించింది స్కార్లెట్. వచ్చే ఏడాది మార్వెల్ స్టూడియో తీస్తున్న 'బ్లాక్ విండో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
44.1 మిలియన్ డాలర్ల సంపాదనతో 'మోడ్రన్ ఫ్యామిలీ' నటి సోఫియా వర్గారా రెండో స్థానంలో నిలిచింది. రీసీ వితర్స్పూన్(35 మిలియన్ డాలర్లు), నికోల్ కిడ్‌మ్యాన్(34 మిలియన్ డాలర్లు) ఆదాయార్జనతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. జెన్నిఫర్ అనిస్టన్ 28 మిలియన్ డాలర్ల సంపాదనతో ఐదో స్థానం దక్కించుకుంది. కాలే క్యూకో (25 మిలియన్ డాలర్లు), ఎలిజబెత్ మోస్ (24 మిలియన్ డాలర్లు), మార్గట్ రాబీ (23.5 మిలియన్ డాలర్లు), చార్లిజ్ థెరాన్, ఎలెన్ పాంపియో టాప్ 10లో నిలిచారు.
ఈ ఏడాది అందరి నటీమణుల సంపాదన 69 శాతం పెరిగి 314.6 మిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపింది ఫోర్బ్స్.
ఇదీ చూడండి: 'శ్రీకారం'లో శర్వానంద్ పాత్ర నిజమేనా!