యువ నటుడు సత్యదేవ్ తెలుగులో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ భిన్నమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. తాజాగా ఇతడు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'రామ్ సేతు' (ram setu movie) చిత్రంలో సత్య నటించనున్నాడట.
అభిషేక్ శర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఇందులో దక్షిణాది నుంచి సీనియర్ నటుడు నాజర్‌ను కూడా తీసుకున్నారట. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ భరుఛా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కేఫ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ప్రొడక్షన్స్ కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 18న అయోధ్య రామజన్మభూమిలో షూటింగ్ ప్రారంభమైంది.
కరోనా రెండో దశ కారణంగా ప్రస్తుతం చిత్రీకరణ ఆగిపోయింది. లాక్‌డౌన్ ఎత్తివేయగానే మళ్లీ షూటింగ్ ప్రారంభమవుతుంది. సత్యదేవ్ హిందీ సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో 'ది ఘాజీ అటాక్'తో పాటు 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'లో నటించాడు. సత్యదేవ్ నటించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రంలో అతని నటనతో పాటు సినిమాకి కూడా మంచి ప్రశంసలే దక్కాయి. ప్రస్తుతం తెలుగులో తమన్నాతో కలిసి 'గుర్తుందా శీతాకాలం'లో నటిస్తున్నాడు. 'తిమ్మరుసు', 'గాడ్సే'లాంటి చిత్రాలు చేస్తున్నాడు.