'ది ఫ్యామిలీమ్యాన్ 2' వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే అందరి మెప్పు పొందింది నటి సమంత. ఇందులో తమిళ ఈలం సోల్జర్ రాజీగా ఆమె కనబర్చిన నటనకు సినీప్రియులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఇప్పుడామె నుంచి మరో ఓటీటీ కబురు రానున్నట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్.. సామ్‌తో ఓ భారీ వెబ్ సిరీస్ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకు పెద్ద మొత్తంలో పారితోషికం ముట్టజెప్పేందుకు సిద్ధంగా ఉన్నారట.
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ బృందం సమంతతో చర్చలు ప్రారంభించిందని, ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి కనబరుస్తుందని ప్రచారం వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. త్వరలో దీనిపై మరింత స్పష్టత విడుదలై ఇందులో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పౌరాణిక చిత్రం చేస్తోంది సమంత. తమిళంలో నయనతారతో 'కాతువాకుల రెండు కాదల్' సినిమాలో నటిస్తోంది.