సినిమా విడుదలకే కాదు వాటిని ప్రచారం చేసేందుకు పండగలు నెలవుగా మారతాయి దర్శకనిర్మాతలకు. అందుకే కొందరు థియేటర్లలలో సందడి చేస్తే, మరికొందరు సామాజిక మాధ్యమాల వేదికగా విడుదలకు సిద్ధమయ్యే చిత్రాల ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్లు చూపిస్తారు. సాయి పల్లవి కూడా పండగ పూట అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వనుందని టాలీవుడ్ టాక్.
అదేంటంటే? శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్యతో కలిసి సాయిపల్లవి ఓ చిత్రం చేస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. 'లవ్‌స్టోరీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులోని పల్లవి ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తోందట చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన చైతూ లుక్ ఆకట్టుకుంది.
శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కలయికలో వస్తున్న రెండో చిత్రం కావడం వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. 'ఫిదా'లో భానుమతిగా అలరించిన పల్లవి ఈ చిత్రంలో ఏ పాత్రతో ఆకట్టుకోబోతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇవీ చూడండి.. 'త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ల పేర్లు బాగుంటాయి'