RRR Movie Collection: 'రౌద్రం.. రణం.. రుధిరం..' పేరుకు తగ్గట్టే బాక్సాఫీసు రికార్డులను తిరగరాసేందుకు థియేటర్ల వద్ద రణం చేయబోతుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే చిత్ర బృందం.. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 థియేటర్లలో విడుదలైన 'ఆర్ఆర్ఆర్'... తమిళనాడులో 400, కేరళలో 250, కర్ణాటకలో 350 థియేటర్లలో విడుదలైంది. అలాగే ఉత్తరాదిలోనూ దాదాపు 3 వేల థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్'ను ప్రదర్శిస్తున్నారు. ఇక విదేశాల్లో అయితే ఇంతకు ముందు లేని విధంగా రికార్డు సృష్టించింది. బ్రిటన్ లో 1100, ఆస్ట్రేలియా, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, థాయిలాండ్, జపాన్ సహా మరికొన్ని ప్రాంతాల్లో 2000 తెరలపై విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరోజే 75వేల నుంచి 80 వేల షోలతో సందడి చేస్తుంది. ఇంత భారీ స్థాయిలో విడుదలైన చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' రికార్డు సృష్టించింది.
సుమారు రూ.500 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని విడుదలకు ముందే బయ్యర్లు రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. నైజాం రూ. 72 కోట్లు, సీడెడ్ రూ.45 కోట్లు, గుంటూరు రూ.18 కోట్లు, ఈస్ట్ రూ.17 కోట్లు, వెస్ట్ రూ.14 కోట్లు, కృష్ణ రూ.14 కోట్లు, నెల్లూరు రూ.9 కోట్లకు కొనుగోలు చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.189 కోట్ల వ్యాపారం చేసింది. ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమాకు లేనంత ఎక్కువ ధర 'ఆర్ఆర్ఆర్' పలికింది. అయితే ప్రిరిలీజ్‌కు ముందు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెరగడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు సందిగ్ధంలో పడ్డారు. దీంతో నిర్మాణ సంస్థ ఈ మొత్తాల్లో కొంత తగ్గించినట్లుగా తెలుస్తోంది. అలాగే కర్ణాటకలో రూ.50 కోట్లు, తమిళనాడు రూ.45 కోట్లు, కేరళలో రూ.10 కోట్లు, ఉత్తరాదిలో రూ.100 కోట్లు, యూఏఈలో రూ.26 కోట్లు, ఓవర్సీస్ రూ.70 కోట్ల వ్యాపారం జరిగింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలకు ముందే 'ఆర్ఆర్ఆర్' రూ.490 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది.
సినిమా విడుదలకు ముందే అదే స్థాయిలోనూ టికెట్ల అమ్మకాలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు 5 ఆటలకు టికెట్లు అమ్ముడుపోగా.. విదేశాల్లో రికార్డు స్థాయి వసూళ్లు కనిపించాయి. విడుదలకు ముందే ప్రిమియర్ షోల్లో 'బాహుబలి-2' రికార్డులను అధిగమించింది. అమెరికా ప్రిమియర్స్‌లో బాహుబలి 2.4 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. ఆ వసూళ్లను అధిగమించి 'ఆర్ఆర్ఆర్' 3 మిలియన్ డాలర్లకు చేరుకుంది. రాజమౌళి.. తన సినిమా రికార్డును తనే చెరిపేయడం పట్ల విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తెలుగులో 'బాహుబలి' సాధించిన రూ.1800 కోట్లను 'ఆర్ఆర్ఆర్' సులభంగా అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తొలి మూడురోజుల వసూళ్లు ఆశించిన స్థాయిలోనే ఉన్నాయని, సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, మళ్లీ మళ్లీ థియేటర్‌కు రప్పించే కాంబినేషన్, కథ ఉండటం వల్ల 'ఆర్ఆర్ఆర్' వసూళ్లు.. రూ.3 వేల కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే మరో ఆందోళన కూడా డిస్ట్రిబ్యూటర్ల నుంచి వ్యక్తమవుతోంది. 26 నుంచి ఐపీఎల్ ఉండటం, టికెట్ ధరలు పెరగడం, విద్యార్థులకు పరీక్షల సమయం కావడం 'ఆర్ఆర్ఆర్' వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: Rrr Public Talk: 'యాక్టింగ్ ఇరగదీశారు.. రాజమౌళితో మామూలుగా ఉండదు'