బాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, మంగళవారం అరెస్టు చేసింది. విచారణలో పలు విషయాలు వెల్లడించింది రియా. సుశాంత్ డ్రగ్స్‌కు సంబంధించిన ప్రతి లావాదేవీ తనకు తెలుసని ఆమె చెప్పినట్లు సమాచారం. దీనితో పాటే తామిద్దరం సేవించిన కొన్ని మాదక ద్రవ్యాల పేర్లను అధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి సోదరుడు సోవిక్, సుశాంత్ మేనేజర్ శ్యామూల్ మిరిండాలతో పాటు డ్రగ్స్ డీలర్స్ బసిత్ పరిహర్, ఇబ్రహీం, జాయిద్లను అరెస్టు చేసింది ఎన్సీబీ. తనకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని.. జీవితంలో ఇంతవరకు మత్తుపదార్ధాలను సేవించలేదని కొన్ని సందర్భాల్లో చెప్పిన రియా.. ఎన్సీబీ విచారణలో పట్టుబడటం వల్ల ఆమెపై విమర్శలు వస్తున్నాయి.
జ్యుడీషియల్ కస్టడీలో రియా
సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడటం వల్ల నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. అనంతరం ఆమెను మూడు రోజుల పాటు విచారించిన అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. కస్టడీలోకి తీసుకున్న రియాకు వైద్య పరీక్షలతో పాటు కరోనా పరీక్షలు చేయించారు. ఆమెకు కొవిడ్ నెగటివ్ రావడం వల్ల కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం, డ్రగ్స్ కేసులో ఆమెకు సెప్టెంబర్ 22 వరకు కస్టడీ విధించింది. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.