కరోనా కారణంగా గతేడాది కుదులైనా తెలుగు సినీ పరిశ్రమ ఆ లోటును భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఓటీటీలకు అలవాటుపడిన ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించేందుకు దర్శక నిర్మాతలు.. తమ సినిమాల విడుదల తేదీలను ముందస్తుగానే ప్రకటించి.. ఈ ఏడాది బాక్సాఫీసును కళకళలాడించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కటిగా విడుదల తేదీలను ప్రకటిస్తూ అభిమానులు, ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు సినిమాల విడుదల తేదీలు ఖరారయ్యాయి. ఒక్కో నెలలో మూడు నాలుగు పెద్ద సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీపడుతుండగా.. మరికొన్ని చిన్న సినిమాలు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి.
తొలి చిత్రంతో వైష్ణవ్‌తేజ్
లాక్డౌన్ కారణంగా విడుదల వాయిదా పడిన చిత్రాలు అన్ని సమస్యలను అధిగమిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఫిబ్రవరిలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా 'ఉప్పెన' ఫిబ్రవరి 12న రానుండగా.. నితిన్, చంద్రశేఖర్ ఏలేటి కలయికలో వస్తున్న 'చెక్' చిత్రం ఫిబ్రవరి 19న విడుదల కానుంది. ఫిబ్రవరి 26న సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్ ప్రెస్'తో కనిపించనున్నారు.
శివరాత్రికి హంగమా
శివరాత్రి కానుకగా శర్వానంద్ నటించిన 'శ్రీకారం' మార్చి 11న విడుదలకానుంది. అదే రోజు నాగ్అశ్విన్ దర్శకత్వ పర్యవేక్షణలో నిర్మించిన 'జాతిరత్నాలు' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రానా 'అరణ్య', నితిన్ 'రంగ్ దే' మార్చి 26న రానుంది.
'వకీల్‌సాబ్' ఆగమనం
ఏప్రిల్ 2న గోపిచంద్ 'సీటీమార్' రానుండగా.. ఏప్రిల్ 9న పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' విడుదల చేసేందుకు నిర్మాత దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్‌స్టోరి' ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని టక్ జగదీశ్ కూడా 'లవ్‌స్టోరి'తో పోటీపడబోతుంది. ఏప్రిల్ 30న రానా-సాయిపల్లవిల 'విరాటపర్వం' విడుదలకాబోతుంది. ఒకే నెలలో సాయిపల్లవి నటించిన రెండు సినిమాలు విడుదల కానుండటం ఆమె అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
మేలో చిరు-వెంకీల సందడి
ఇక మే నెలలో ఇద్దరు అగ్రహీరోలు బాక్సాఫీసును షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. మే 7న అక్కినేని అఖిల్, పూజా హెగ్డే నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రానుండగా.. ఒక వారం వ్యవధిలోనే వెంకటేశ్, చిరంజీవి చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' మే 13న విడుదల కానుండగా.. మే 14న వెంకీ నటించిన 'నారప్ప' రాబోతుంది.
ప్రభాస్-యశ్ కలిసి
జూన్‌లో బాలకృష్ణ-బోయపాటి సినిమా సోలోగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. జులైలో అడవిశేష్‌తో మహేశ్‌బాబు నిర్మించిన 'మేజర్' విడుదలకానుంది. జులై 2న 'మేజర్' విడుదలను అధికారికంగా ప్రకటించారు. అలాగే జులైలో పాన్ ఇండియా సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ చాప్టర్ 2' జులై 16న విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' జులైలోనే రిలీజ్ కానుంది. వరుణ్‌తేజ్ నటించిన 'గని' జులై 30న బాక్సాఫీసును తాకనుంది.
ఆగస్టులో 'పుష్పరాజ్' రాక
ఇక ఆగస్టులో సుకుమార్, అల్లు అర్జున్ కలయికలో వస్తున్న మూడో సినిమా రికార్డుల మోత మోగించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 13న 'పుష్ప' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 19న శర్వానంద్, సిద్ధార్థ్ మల్టీస్టారర్ 'మహాసముద్రం' విడుదలకానుంది. 2019లో నవ్వులు పూయించి నిర్మాతలకు కనకవర్షం కురిపించిన 'ఎఫ్ 2'కు కొనసాగింపుగా వస్తున్న 'ఎఫ్ 3' ఆగస్టు 27న సందడి చేయనుంది.
పవన్-రానా మల్టీస్టారర్
పవన్-రానా కలిసి నటిస్తున్న 'అప్పయనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ సెప్టెంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ట్రిబుల్ 'ఆర్' ధమాకా
అక్టోబర్ మొత్తం రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా పాత రికార్డులను తుడిచిపెట్టేందుకు రాబోతుంది. ఆ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదలకానుంది.
సంక్రాంతికి సూపర్‌స్టార్
విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కలయికలో రూపుదిద్దుకుంటున్న 'లైగర్' విడుదల తేదీ ఖరారు కావల్సి ఉండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి మహేశ్ బాబు 'సర్కారువారి పాట'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.
విడుదల తేదీలు ఖరారైన సినిమాల వివరాలుః
సినిమా పేరు | విడుదల తేది |
జాంబీరెడ్డి | ఫిబ్రవరి 5 |
జిజాంబి | ఫిబ్రవరి 5 |
ఉప్పెన | ఫిబ్రవరి 12 |
ఫాదర్ - ఉమా- చిట్టీ- కార్తీక్ | ఫిబ్రవరి 12 |
చెక్ | ఫిబ్రవరి 19 |
ఏ1 ఎక్స్ ప్రెస్ | ఫిబ్రవరి 26 |
శ్రీకారం | మార్చి 11 |
జాతిరత్నాలు | మార్చి 11 |
అరణ్య | మార్చి 26 |
రంగ్ దే | మార్చి 26 |
సీటీమార్ | ఏప్రిల్ 2 |
వకీల్ సాబ్ | ఏప్రిల్ (అంచనా) |
లవ్‌స్టోరి | ఏప్రిల్ 16 |
టక్ జగదీశ్ | ఏప్రిల్ 16 |
విరాటపర్వం | ఏప్రిల్ 30 |
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ | మే 7 |
ఆచార్య | మే 13 |
నారప్ప | మే 14 |
ఖిలాడి | మే (అంచనా) |
మేజర్ | జులై 2 |
కేజీఎఫ్ చాప్టర్ 2 | జులై 16 |
రాధేశ్యామ్ | జులై (అంచనా) |
గని | జులై 30 |
పుష్ప | ఆగస్టు 13 |
మహాసముద్రం | ఆగస్టు 19 |
ఎఫ్ 3 | ఆగస్టు 27 |
పవన్-రానా మల్టీస్టారర్ | సెప్టెంబర్ (అంచనా) |
ఆర్ఆర్ఆర్ | అక్టోబర్ 13 |
సర్కారువారి పాట | జనవరి 2022 |