ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరిపై నటుడు విశాల్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పు చెల్లించినప్పటికీ ప్రామిసరీ నోటును తిరిగి ఇవ్వకుండా చౌదరి తనని ఇబ్బందులు పెడుతున్నారని విశాల్ ఆరోపణలు చేశారు. కాగా, విశాల్ ఆరోపణలు, పెట్టిన కేసు గురించి తాజాగా నిర్మాత చౌదరి స్పందించారు. ఇది కేవలం చిన్న విషయం మాత్రమేనని.. తాము ఇప్పటివరకూ విశాల్‌ని అస్సలు ఇబ్బందులు పెట్టలేదని ఆయన అన్నారు.
‘"ఇరుంబు తిరై' సినిమా చిత్రీకరిస్తున్న సమయంలో డబ్బు అవసరమైతే నేను, తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి విశాల్‌కు కొంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చాం. అప్పు తీసుకున్న సమయంలో విశాల్ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేసి ఇచ్చాడు. కొంతకాలానికి విశాల్ తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఈ విషయాన్ని కూడా మేము ఓ డాక్యుమెంట్‌పై రాసి సంతకాలు పెట్టాం. కాగితాలన్నింటినీ దర్శకుడు శివకుమార్ దగ్గర ఉంచాం. శివకుమార్ ఆకస్మిక మరణంతో ఆ కాగితాలు ఎక్కడ దాచారో మాకు తెలియలేదు. దాంతో మేము వాటిని విశాల్‌కు తిరిగి ఇవ్వలేకపోయాం. అదే విషయాన్ని చెప్పాం. కానీ వినిపించుకోలేదు. ఆ డాక్యుమెంట్లు మా దగ్గరే ఉన్నాయని.. వాటితో మేము ఏదైనా సమస్య సృష్టించే అవకాశం ఉందంటూ విశాల్ భయపడుతున్నారు. నిజంగానే ఆ డాక్యుమెంట్స్ మా వద్ద లేవు. ఇప్పుడు ఈ సమస్యే కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది" అని చౌదరి వివరించారు.