'బాహుబలి', 'తలైవి' వంటి చిత్రాలకు కథను అందించిన సినీ రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్.. కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న కొత్త చిత్రం 'సీత: ది ఇంకార్నేషన్'. అలౌకిక్ దేశాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రావణుడిగా బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నటించనున్నారట. ఇప్పటికే ఆయన విజయేంద్ర ప్రసాద్‌తో సంప్రదింపులు జరిపారని ప్రచారం జరుగుతోంది.
రావణుడి పాత్రపై రణ్‌వీర్ మనసు పడ్డాడని తెలుస్తోంది. అయితే సినిమాలో సీతగా ఎవరు నటిస్తున్నారనే విషయంపై అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. సీత పాత్రలో కరీనా కపూర్ నటించనుందనే వార్తలు ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. ఆ పాత్రకు కరీనా అయితే బాగుంటుందని విజయేంద్ర ప్రసాద్ - అలౌకిక్‌లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. కరీనాతో ఇప్పటికే చిత్రబృందం సంప్రదించారట. అయితే అందుకు ఆమె కూడా సానుకూలంగా ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
గతంలో కరీనా - రణ్‌వీర్ కలిసి 'గోలియోన్ కి రాస్‌లీలా రామ్‌లీలా' చిత్రంలో నటించాల్సింది. కానీ అనుకోని కారణాలతో వీరి కాంబినేషన్ సెట్ కాలేదు. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి 'సీత'లో నటిస్తే ఇదే వారి మొదటి చిత్రం అవుతుంది.
'సీత' సినిమాను ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తుండగా మనోజ్ ముంతాషీర్ సాహిత్య, సంభాషణలు సమకూరుస్తున్నారు. పూర్తిస్థాయి వీఎఫ్ఎక్స్ సాంకేతికతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటి వరకు ఎవరూ చూడని, ఎవరికీ తెలియని సరికొత్త 'సీత'ను ఈ సినిమా ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నారు.
ఇదీ చూడండి: ఆనందయ్య మందుపై జగపతిబాబు ఆసక్తికర ట్వీట్