ఎట్టకేలకు కథానాయకుడు రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ హీరో హైదరాబాద్‌కు చెందిన మిహీకా బజాజ్‌తో ప్రేమలో ఉన్నాడు. తన ప్రేమ ఫలించిందని, ఆమె అంగీకరించిందని రానా మంగళవారం ప్రకటించాడు. ఆమెతో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. ఈ సందర్భంగా రానా ప్రేయసి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
- ముంబయిలోని రచనా సంసాద్‌లో మిహీక ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లమా పూర్తి చేసింది. లండన్‌లోని చెల్సియా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో ఎంఏ పూర్తి చేసింది.
- మిహీక 'డ్యూ డ్రాప్ స్టూడియో' అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతోంది. ఆమెకు భారతీయ వాస్తుశిల్ప కళంటే ఇష్టమట. అందుకే ఈ వృత్తిని ఎంచుకున్నట్లు తెలిసింది.
- ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను బట్టి మిహీకలో రచయిత్రి కూడా ఉన్నట్లు తెలిసింది. ఆమె 'Pixie Dust' పేరుతో బ్లాగ్ నడుపుతోంది.
- మిహీక తల్లి బంటీ బజాజ్ జ్యువెలరీ డిజైనర్. Krsala అనే బ్రాండ్‌ను స్థాపించారు. ఆమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఆమె జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీలో చదువుకున్నారు. తన తల్లిని ఉద్దేశిస్తూ గత ఏడాది మాతృ దినోత్సవం సందర్భంగా మిహీక ఓ పోస్ట్ చేసింది. "నా బలంగా ఉన్నందుకు ధన్యవాదాలు. నాకెప్పుడూ నువ్వు మద్దతుగా ఉన్నావు. నీలా ఎవరూ ఉండరు. నాకు తెలిసిన అందమైన, మంచి హృదయం ఉన్న, శ్రమించే, అంకితభావం ఉన్న వ్యక్తివి నువ్వు. నీలో 25 శాతం గుణాలు నాలో ఉన్నా.. నేను అదృష్టవంతురాల్ని. లవ్ యూ" అని తల్లిపై ప్రేమను తెలిపింది.
- 2018లో మిహీక ఈ మ్యాగజైన్ యు అండ్ ఐతో మాట్లాడింది. ఆ సందర్భంగా తన తల్లి తొలుత కార్యక్రమాలు, పెళ్లి వేడుకలు నిర్వహించేదని, ఆపై వివాహ అలంకరణ నిర్వహణలో భారతదేశంలో టాప్‌గా నిలిచారని చెప్పింది. "మా అమ్మ వల్ల చిన్నతనం నుంచి అలంకరణ గురించి చూస్తున్నా. కాబట్టి నా సృజనాత్మకతను మెరుగు దిద్దుకోవడానికి దీనికి మించిన పని లేదు అనిపించింది. ఇప్పటికే తెలిసిన ఫీల్డ్ కావడం వల్ల పనులు కూడా సులభంగా జరుగుతాయి" అని మిహీక పేర్కొంది.
- మిహీకకు సోదరుడు సమర్థ్ ఉన్నాడు. అతడు తన తల్లికి సంబంధించిన జ్యువెలరీ ప్రొడక్షన్‌ను చూసుకుంటుంటారట. తన సోదరుడు ముంబయిలో ఓ కొత్త సంస్థను ప్రారంభించబోతున్నాడని, అది అందరి దృష్టిని ఆకర్షిస్తుందని 2018లో ఆమె మ్యాగజైన్‌తో తెలిపింది.