ప్రపంచం మొత్తం వ్యాప్తిస్తున్న కరోనా(కోవిడ్-19) ధాటికి అన్ని రంగాలూ కుదేలవుతున్నాయి. వీటిలో సినీ పరిశ్రమ ఒకటి. ఈ వైరస్ ప్రభావం వల్ల పలు సినిమాల విడుదల తేదీలు, చిత్రీకరణలు వాయిదా పడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి రానా నటిస్తున్న 'అరణ్య' చేరింది. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే నెల 2న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
"ప్రమాదకర కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నాం. ప్రజల ఆరోగ్య దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరోలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం"
-అరణ్య చిత్రబృందం
హిందీలో 'హాథీ మేరీ సాథీ', తమిళంలో 'కడన్' పేరుతో రానుందీ చిత్రం. జంతువుల మనుగడ కోసం పోరాడే అడవి తెగకు చెందిన వ్యక్తిగా రానా నటించాడు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించగా, ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించాడు.

దేశవ్యాప్తంగా నో సినిమా షూటింగ్స్
కరోనాను కట్టడి చేసేందుకు వినోద రంగం ఒక్కటైంది. దేశవ్యాప్తంగా ఈనెల 19 నుంచి 31 వరకు.. సినిమా, టీవీ సీరియల్స్, డిజిటల్ షోల షూటింగ్స్ ఆపేయాలని దాదాపు అన్ని చిత్ర పరిశ్రమలు నిర్ణయం తీసుకున్నాయి.
ఇదీ చదవండి : నిర్మాతగా సక్సెస్ అయిన టాలీవుడ్ హీరోలు వీరే!