దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'(RRR).. కరోనా ఆంక్షల తర్వాత ఇటీవలే చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది. నాలుగు రోజుల క్రితమే రామ్‌చరణ్, ఎన్టీఆర్ షూటింగ్ సెట్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరిపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ సెట్లో కొన్ని రామ్‌చరణ్ ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అయితే జులై చివరినాటికి షూటింగ్ పూర్తి చేసి, ముందే చెప్పినట్లుగా అక్టోబరు 13న థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.


'రాధేశ్యామ్' షూటింగ్ సెట్లో..
అగ్రకథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న వింటేజ్ ప్రేమకథ 'రాధేశ్యామ్' చిత్రీకరణ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. షూటింగ్ సెట్లోని ఓ చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ షెడ్యూల్లో ఓ డ్యూయెట్ సాంగ్, కీలక సన్నివేశాలను చిత్రీకరించి.. దసరా సందర్భంగా అక్టోబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినా.. కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

'తూఫాన్' ట్రైలర్ అప్డేట్
'భాగ్ మిల్కా భాగ్' చిత్రం తర్వాత హీరో ఫర్హాన్ అక్తర్, దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'తూఫాన్'. ఇందులో ఫర్హాన్, ఫ్రొపెషనల్ బాక్సర్‌గా కనిపిస్తారు. పరేశ్ రావల్, మృణాల్ ఠాకుర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. జులై 16న అమెజాన్ ప్రైమ్ ద్వారా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను జూన్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

'గల్లీరౌడీ' ఈజ్ రెడీ!
'గల్లీరౌడీ'గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. నేహా శెట్టి నాయికగా. బాబీ సింహా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, సెన్సార్ కార్యక్రమాల కోసం సిద్ధమవుతోంది. 'గల్లీరౌడీ ఈజ్ రెడీ' అంటూ ఈ విషయాన్ని ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని కోనా ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చౌరస్తా రామ్, సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'పుట్టెనే ప్రేమ..' అనే పాట, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

శర్వా కొత్త చిత్రంలో అమల..
ఇటీవల 'శ్రీకారం'తో మంచి విజయం ఖాతాలో వేసుకున్న శర్వానంద్.. అదే జోరులో మరో సినిమాతో అలరిచేందుకు సిద్ధమయ్యాడు. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. శర్వానంద్ హీరోగా శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'ఒకే ఒక జీవితం' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేసింది. శర్వా సరసన రీతూవర్మ హీరోయిన్‌గా సందడి చేయనుంది. అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలకపాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బొజోయ్ సంగీతం అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాయడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

చిరు 'లూసిఫర్' కోసం..
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 'లూసిఫర్' తెలుగు రీమేక్ త్వరలోనే పట్టాలెక్కనుంది. చిరు నటిస్తున్న 'ఆచార్య' సినిమా చిత్రీకరణ పూర్తవ్వగానే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు మోహన్ రాజా, సంగీత దర్శకుడు తమన్‌తో మ్యూజిక్ సిట్టింగ్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు.




ఇదీ చూడండి.. టీవీలో హిట్.. సినిమాల్లో సూపర్‌హిట్!