Rajamouli Eega Film: తమ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే కపిల్ శర్మ టాక్ షోకు హాజరైంది 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం. ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి గురించి ఓ ఆసక్తికర వార్తను చెప్పారు హీరో ఎన్టీఆర్. 'ఈగ' చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో జక్కన్న ఈగలను బంధించి రిఫ్రిజరేటర్లో ఉంచేవారని తెలిపారు. 'ఫ్రిజ్ ఓపెన్ చేస్తే ఆహార పదార్థాల కన్నా ఈగలే ఎక్కువగా ఉంటాయని' అన్నారు.
వెంటనే రామ్‌చరణ్ స్పందిస్తూ అందుకు గల కారణాన్ని వివరించారు. 'చల్లని వాతవరణంలో ఈగలు నిద్రపోతాయి. అందుకే ఆయన వాటిని అందులో ఉంచేవారు. తద్వారా వాటిని మరింత క్షుణ్ణంగా స్టడీ చేసేవారు" అని చెర్రీ తెలిపారు.
ఇది విన్న కపిల్ శర్మ.. 'మీరు అందరినీ బంధించేస్తారు. ఈగ చేసేటప్పుడు ఫ్రిజ్‌లో వాటిని లాక్ చేసేశారు. 'బాహుబలి' సమయంలో ప్రభాస్‌ను ఫిల్మ్‌సిటీలో ఐదేళ్లు బంధించేశారు' అని బదులిచ్చాడు.
ఇక ఈ సినిమా చేసేటప్పుడు తన డ్రైవర్ తనను పిచ్చివాడిగా భావించినట్లు గుర్తుచేసుకున్నారు రాజమౌళి. 'నేను ఈగ మీద సినిమా చేస్తున్నప్పుడు నా కార్ డ్రైవర్‌కు చాలా కోపం వచ్చింది. 'మీకేమైనా పిచ్చి పట్టిందా?' అన్నాడు. 'ఈగలు, బొద్దింకల గురించి మరిచిపోండి, మనుషుల మీద సినిమా ఎందుకు చేయరు?' అని తనతో అన్నట్లు చెప్పారు.
'ఈగ' సినిమాలో నాని, సమంత, కన్నడ నటుడు సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2012లో ప్రయోగాత్మక చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించింది. కాగా, జక్కన్న రూపొందించిన తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్‌కు అన్ని కోట్ల ఖర్చా?