హిందీలో సత్తా చాటుతున్న తెలుగు దర్శకద్వయం రాజ్ - డీకే. ఇప్పుడక్కడ ఈపేరు ఒక బ్రాండ్. బాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. 'ది ఫ్యామిలీమేన్' వెబ్‌సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించారు. ఈ దర్శకద్వయం నిర్మించిన 'సినిమా బండి' ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా రాజ్, డీకేతో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా ముచ్చటించింది.
'సినిమా బండి'తో మరో యాసను తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించారు. ఈకథలో మొదట మిమ్మల్ని ఆకట్టుకున్నది అదేనా?
రాజ్: దర్శకుడు ప్రవీణ్ మొదట ఒక కాన్సెప్ట్‌తో వచ్చాడు. పాత్రలు స్థానిక యాసలో మాట్లాడతాయని చెప్పాడు. ‘సినిమా బండి’ని ఎలా తీయాలనుకుంటావో, అదే తరహాలో ఒక లఘు చిత్రం తీసుకు రమ్మని చెప్పా. అది నచ్చితే సినిమా చేయాలనుకున్నాం. లఘు చిత్రం చూస్తున్నప్పుడు అందులో భాష ఇంకా బాగా నచ్చింది. నిజానికి ప్రవీణ్ మాట్లాడే యాస అది కాదు, రచయితలదీ గోదావరి ప్రాంతం. పాత్రలు మాట్లాడే యాస విన్న వెంటనే మదనపపల్లి దగ్గర, రామసముద్రం అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ మా అమ్మమ్మవాళ్లు ఇలాగే మాట్లాడేవారు. అలా ఆ మాటలు నన్ను ఆకట్టుకున్నాయి.
డి.కె: సినిమా బండి చూసిన వాళ్లంతా అందులోని యాస గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో మాట్లాడే యాస ఇది. చాలా మందికి ఈ యాస పరిచయం లేదు. మాది చిత్తూరే కాబట్టి, మేం స్కూల్ రోజుల్లో ఇలాగే మాట్లాడేవాళ్లం. సినిమాల్లో మాట్లాడే తెలుగు, మేం మాట్లాడే తెలుగు వేరేలా ఉందేంటి అనుకునేవాళ్లం అప్పట్లో. కానీ ఈ కథ, అందులోని పాత్రలు మాట్లాడే యాస వినగానే 'ఇది కొత్తగా ఉంటుంది, చేద్దాం' అనుకున్నాం. భాష, యాస ఇవేవీ అర్థం కాకపోయినా హిందీ ప్రేక్షకులూ భలే మెచ్చుకుంటున్నారు.
తెలుగులో ఓటీటీ ట్రెండ్‌ను గమనిస్తే ఏం అనిపిస్తోంది?
రాజ్: ఇది ఓటీటీ వేదిక, అది థియటర్ అని కాకుండా... ఆ రెండూ కలిసిపోయిన కొత్త రోజులివి. ఓటీటీలో విడుదలైనా, థియేటర్లో విడుదలైనా సినిమా సినిమానే. దానికి ప్రేక్షకుల నుంచి ఒకే రకమైన స్పందన బయటికొస్తోంది. హిందీలో రెండేళ్ల ముందు నుంచే ఆ వాతావరణం ఉంది. తెలుగులో ఇప్పుడు అదే కనిపిస్తోంది.
డి.కె: ఎక్కడ విడుదల చేయాలనుకున్నా... మాకు అదొక సినిమానే. కథపై నమ్మకంతోనే ‘సినిమా బండి’ నిర్మాణాన్ని ప్రారంభించాం. పరిస్థితులను బట్టి ఓటీటీలో విడుదల చేశాం.
ఓటీటీల్ని థియేటర్లకి ముప్పుగా భావిస్తున్నారా?డి.కె: ఇంట్లో కూర్చుని టీవీలో సినిమాని చూడటం వేరు, థియేటర్లలో ఆస్వాదించడం వేరు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ప్రేక్షకులు థియేటర్లకి వెళ్లి సినిమా చూడటానికి ఇష్టపడతారు. థియేటర్లకి వచ్చే ముప్పేమీ ఉండదు. ఓటీటీ వేదికల వల్ల ప్రపంచం నలుమూలలా ఉన్న షోలు, సినిమాలు చూస్తున్నాం కాబట్టి... మనం మరింత నాణ్యమైన వినోదాన్ని కోరుకుంటాం. అది సినీ రూపకర్తలపైన ఒత్తిడిని పెంచే విషయం. ప్రపంచ సినిమాతో పోల్చి చూసుకుంటూ...మరింత నాణ్యంగా ప్రేక్షకుడికి వినోదాన్ని అందించాల్సి ఉంటుంది.
దర్శకులుగా మీ అభిరుచి ప్రత్యేకంగా ఉంటుంది. నిర్మాణంలో ఆలోచనలు ఎలా ఉన్నాయి? రాజ్: ఎంత రిస్కీ ప్రాజెక్టులు చేయొచ్చో అంత రిస్కీ సినిమాలు చేస్తాం. 'సినిమా బండి' అలాంటిదే. ఈ భాష, యాస ఎంత మందికి అర్థం అవుతుందని భయపెట్టారు, ఇందులో ప్రేమకథ లేదు, పాటలు, డ్యాన్సులు లేవు. తీయడంలో కమర్షియల్ స్టైల్ అంటూ ఏమీ ఉండదు. ఇలా చాలా మంది 'ఇది బాగా రిస్కీ కదా, మీకున్న పేరు పోతుందేమో' అని భయపెట్టారు. ఆ భయాల్ని పక్కన పెట్టి మరీ తీశాం. తదుపరి ఇలాంటి సినిమాలే తీస్తాం.
డి.కె: యేడాదికి పది సినిమాలు చేద్దామనే ఆలోచనలో ఉన్న పెద్ద స్టూడియో అయితే మాది కాదు. అలా చేస్తే నాణ్యత పడిపోతుందని మాకు తెలుసు. ప్రతి సినిమాలోనూ సృజనాత్మకంగా మేం లీనమవుతాం. కొత్తదనం ఉన్న కథలే చేస్తాం.
సినిమాలు, వెబ్ సిరీస్‌లు... ఏది ఎక్కువ సంతృప్తినిచ్చింది?రాజ్: రెండింటినీ మేం సినిమాలుగానే చూస్తాం. అయితే వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు మేకింగ్ పరంగా చాలా ఆస్వాదించా. సినిమాల్లో చాలా పరిమితులు ఉంటాయి. వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని మేం బాగా ఆస్వాదించాం. ఎంత బాగా కథలు చెప్పగలమో అంత బాగా చెప్పే అవకాశం దొరికింది. అందుకే ‘ది ఫ్యామిలీమేన్’ అంతగా ప్రేక్షకుల్ని మెప్పించింది.
డి.కె: సినిమాలు చేస్తూ ఓటీటీలవైపు మొదట వెళ్లిన దర్శకులం మేమే. మీరు సినిమా కదా తీయాల్సింది, వెబ్ సిరీస్ తీస్తే మీకున్న పేరు పోతుందేమో అన్నవాళ్లూ ఉన్నారు. మేం దానికి పూర్తి భిన్నంగా ఆలోచించాం. అది నిజమైనందుకు సంతోషంగా ఉంది. సినిమాల గురించి ప్రణాళికలు ఉన్నాయి. ప్రస్తుతం మా దృష్టి వెబ్ సిరీస్‌లపైనే ఉంది.
'ది ఫ్యామిలీ మేన్2' ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది?రాజ్: ఈ వేసవి పూర్తయ్యేలోపే విడుదల చేస్తామని చెప్పాం. ఆ మాట మీద ఉండటానికే ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే వస్తుంది. ఇందులో సమంత ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది.
తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తారు?డి.కె: మహేశ్, విజయ్ దేవరకొండ... ఇలా పలువురు కథానాయకులతో ఇప్పటికీ మేం టచ్‌లో ఉన్నాం. మేం కలుస్తూనే ఉంటాం, ఐడియాలు కూడా చెప్పాం. సమయం వస్తే తప్పకుండా తెలుగులో సినిమా చేస్తాం.
ఇదీ చూడండి: 'కొన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనాను తరిమేద్దాం'