'లారెన్స్ అన్నా.. ఇబ్బందుల్లో ఉన్నాం సాయం చేయండి' అని అడగడమే ఆలస్యం.. నేనున్నానంటూ తనకు చేతనైన విధంగా సాయం చేస్తారు నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్. తాజాగా తన ట్విటర్ వేదికగా ఓ ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. తాను చదువుకోకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు
"స్నేహితులు, అభిమానులారా..! నా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను చదువుకోలేకపోయా. చదువుకోకపోవడం వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. విద్య విలువ తెలుసుకున్న నేను పేద పిల్లలకు విద్యనందించాలని నిశ్చయించుకున్నా. ఈ ఇద్దరూ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లలు. ఇప్పుడు వీరు 11వ తరగతి ఉత్తీర్ణులయ్యారు. మీ ఆశీర్వాదాలు వీళ్లకు కావాలి" అని లారెన్స్ ట్వీట్ చేశారు.
లారెన్స్ చేసిన పోస్ట్‌కు అనేకమంది స్పందించారు. 'మీరు ఎంతో మంచి మనసుతో సాయం చేస్తున్నారు', 'మీరే మాకు స్పూర్తి లారెన్స్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల లాక్‌డౌన్ సమయంలోనూ లారెన్స్ పేదలకు వివిధ రూపాల్లో సాయం అందించారు. ప్రస్తుతం ఆయన 'చంద్రముఖి 2'లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. లారెన్స్ దర్శకత్వం వహించిన 'కాంచన' రీమేక్ 'లక్ష్మీ బాంబ్'.. త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.