Priyamani on Negative comments: వివాహమైన తర్వాత కూడా వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటి ప్రియమణి. ఆమె ప్రధానపాత్రలో నటించిన సరికొత్త చిత్రం 'భామాకలాపం'. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో ఆమె సాదాసీదా గృహిణిగా కనిపించనున్నారు. పక్కింట్లో ఏం జరుగుతోంది? ఎదుటివాళ్లు ఏం మాట్లాడుకొంటున్నారు? వంటి విషయాలపై ఆసక్తి ఉన్న మహిళగా సినిమాలో ఆమె పాత్రను తీర్చిదిద్దారు.
మరికొన్నిరోజుల్లో 'భామాకలాపం' ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ప్రియమణి ఇంటర్వ్యూ ఇచ్చారు. 'భామాకలాపం'లోని అనుపమ పాత్రకు.. తన నిజజీవితానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వ్యక్తిగతంగా తాను ఎంతో సైలెంట్ అని వెల్లడించారు. "భామాకలాపం’లో అనుపమ పాత్ర చాలా సరదాగా ఉంటుంది. పక్కింట్లో ఏం జరుగుతోంది? పొరుగింటి వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు? అనే విశేషాలపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటుంది. అనుపమకు వంట చేయడం బాగా వచ్చు. అనుపమ పాత్రకు నా వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే, రియల్‌లైఫ్‌లో నాకు వంట చేయడం రాదు. నా భర్త వండి పెడితే బాగా తింటాను. ఎక్కువశాతం ఇంట్లో ఉండటానికే ఆసక్తి కనబరుస్తాను. బయటవాళ్ల విషయాలు నేను పట్టించుకోను" అని చెప్పారు.
అనంతరం ప్రతికూల కామెంట్స్‌ను మీరు ఎలా ఎదుర్కొంటారని విలేకరి ప్రశ్నించగా.. "నేను ప్రతికూల కామెంట్స్‌ను పట్టించుకోను. నాకు అవసరంలేని ఏ విషయాన్నైనా ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తాను. అలా కాకుండా, ప్రతికూల కామెంట్స్ వచ్చిన ప్రతిసారీ మనం స్పందిస్తే.. ఆ వ్యాఖ్యలకు మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందని నమ్ముతుంటాను. ఎలాంటి వార్తలు వచ్చినా నా కుటుంబానికి, భర్తకు మాత్రమే నేను జవాబుదారీ. మిగిలిన ప్రపంచానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు" అని ప్రియమణి సమాధానమిచ్చారు.
ఇదీ చూడండి: త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్ట్ షురూ.. మహేశ్ అందుకే రాలేదా?