తెలుగులో ఘన విజయం సాధించిన 'ప్రస్థానం' సినిమా హిందీలో రీమేక్ కాబోతుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని ధ్రువీకరించాడు దర్శకుడు దేవాకట్టా. 2010లో విడుదలైన ప్రస్థానం సినిమాలో సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.
"సంజయ్ దత్ ప్రస్థానం రీమేక్ చేద్దామని 2011లోనే నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు వీలుపడలేదు. ప్రస్తుతం సంజయ్ సతీమణి మాన్యతా దత్ ఈ చిత్రాన్ని తీయడానికి ముందుకొచ్చారు. ప్రస్థానం కథలో మార్పులేమి చేయట్లేదు " - దేవా కట్టా, దర్శకుడు.
ఈ రీమేక్‌లో జాకీ ష్రాఫ్, మనీషా కోయిరాలా, అలీ ఫజల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరులో ప్రస్థానం హిందీ రీమేక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆటోనగర్ సూర్య, వెన్నెల లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు దేవా కట్టా. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి బాహుబలి ప్రీక్వెల్ శివగామి సిరీస్‌కు సహదర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.