కొందరు నటులకు కొన్ని పాత్రలు చక్కగా సరిపోతాయి. అయితే ఏ పాత్ర అయినా చేయగల నటులు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి నటుల్లో ప్రకాష్‌రాజ్ ఒకరు. రంగస్థల నటుడిగా కెరీర్ ఆరంభించిన ఆయన ఆరు భాషల్లో వందల చిత్రాల్లో నటించారు. నటుడిగా, ప్రతినాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమలో చెరగని ముద్రవేశారు. అందుకే ఆయన 'విలక్షణ' నటుడుగా పేరు తెచ్చుకున్నారు. నటుడిగా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో అదే స్థాయిలో వివాదాలతోనూ సహవాసం చేశారు. అవన్నీ పక్కన పెడితే మానవతా వాదిగా ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడక తప్పదు. శుక్రవారం(మార్చి 26) ప్రకాష్‌రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.
పాత్రలో పరకాయ ప్రవేశం
ఫలానా సినిమాలో ప్రకాష్‌రాజ్ ఓ పాత్ర చేస్తున్నారంటే ఆ పాత్రలో ఆయన కనిపించరు. కేవలం ఆ పాత్ర మాత్రమే వెండితెరపై దర్శనమిస్తుంది. ప్రతినాయకుడిగా, తండ్రిగా, తాతగా ఇలా పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి నటిస్తారు ప్రకాష్‌రాజ్. రంగస్థల నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన కేవలం బ్రతకడం కోసమే తొలుత సినిమాల్లోకి వచ్చానని చెబుతారు. చిన్నతనం నుంచి ప్రేక్షకుల కొట్టే చప్పట్లే తనను నటుడిగా మార్చాయని అంటారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తొలినాళ్ల చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చారు. కానీ, నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిన చిత్రం కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'డ్యుయెట్'. కెరీర్‌లో తొలినాళ్లలో ప్రకాష్‌రాజ్‌కు దక్కిన పాత్రలే ఆయనను జాతీయస్థాయి నటుడిని చేశాయని చెప్పాలి. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇద్దరు' చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డునూ అందుకున్నారు.
'మోనార్క్' నుంచి 'ఎమ్మెల్యే నాగేంద్ర' వరకూ..
ప్రకాష్ అంటే తొలుత గుర్తొచ్చేది ఆయన నటించిన ప్రతినాయకుడి పాత్రలే. 'సుస్వాగతం' చిత్రంలో 'నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు' అంటూ ఆయన పలికే డైలాగ్‌లు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తాయి. ప్రకాష్‌రాజ్ నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే సమయానికి రఘువరన్ అన్ని రకాల పాత్రలు చేసేవారు. ఆ తర్వాత ఆయన స్థానాన్ని ప్రకాష్‌రాజ్ భర్తీ చేశారనే చెప్పాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముఖ్యంగా కృష్ణవంశీ, వి.వి.వినాయక్, పూరి జగన్నాథ్, గుణశేఖర్‌ల సినిమాల్లో ప్రకాష్‌రాజ్ పోషించిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా ఉన్న సినిమాల్లో పోషించిన పాత్రలూ విశేష ప్రేక్షకాదరణ చూరగొన్నాయి.
మర్చిపోలేని చిత్రాలు..!
'ఇద్దరు', 'సుస్వాగతం', 'చూడాలని ఉంది', 'నువ్వు నాకు నచ్చావ్', 'బద్రి', 'అంతఃపురం', 'ఇడియట్', 'ఒక్కడు', 'దిల్', 'ఖడ్గం', 'ఠాగూర్', 'ఆజాద్', 'పోకిరి', 'అతడు', 'బొమ్మరిల్లు', 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే', 'గూఢచారి', 'రంగస్థలం', 'సరిలేరు నీకెవ్వరు' ఇలా అనేక చిత్రాల్లో ప్రకాష్‌రాజ్ పోషించిన పాత్రలను ఎవరూ మర్చిపోలేరు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నటుడిగా విభిన్న పాత్రలతో మెప్పించిన ప్రకాష్‌రాజ్ దర్శకుడిగానూ తనదైన ముద్రవేశారు. కన్నడలో ఆయన తీసిన 'నాను నాన్న కనసు' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 'ఉలవచారు బిర్యానీ' చిత్రం ఆయన అభిరుచిని తెలిపింది. 'మన ఊరి రామాయణం'లో ఆయన నటన హైలైట్ అని చెప్పాలి. ఇక నిర్మాతగానూ ప్రకాష్‌రాజ్ వ్యవహరించారు. తొలిసారి 'దయ' అనే తమిళ చిత్రాన్ని నిర్మించారు. అక్కడి నుంచి తన అభిరుచి మేరకు పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే వచ్చారు. తెలుగులో 'గగనం' చిత్రాన్ని నిర్మించారు. నటుడిగా ఇప్పటికీ ప్రకాష్‌రాజ్ బిజీ బిజీ. 'నారప్ప', 'పుష్ప', 'వకీల్ సాబ్', 'కె.జి.యఫ్2', 'అన్నాత్తే', 'తలైవి' చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు.
అవార్డుల మందారమాల
వెండితెరపై అద్భుతంగా నటించే ప్రకాష్‌రాజ్‌కు అవార్డులకు కొదవ లేదు. 'ఇద్దరు' చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా తొలిసారి జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఆయన 'కాంచీవరం' చిత్రానికి ఉత్తమనటుడిగా అవార్డు దక్కించుకున్నారు. అయిదుసార్లు ఫిలింఫేర్ అవార్డు, ఆరుసార్లు నంది అవార్డు, ఇంటర్నేషనల్ తమిళ్ ఫిల్మ్ అవార్డు ఒకసారి, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును నాలుగుసార్లు, విజయ అవార్డును మూడుసార్లు సొంత చేసుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అదే సక్సెస్ సీక్రెట్
మీ విజయ రహస్యం ఏంటి అనడిగితే.. ప్రకాష్‌రాజ్ నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. 'తీవ్రంగా బ్రతకడం. నాకు నచ్చినట్టు బ్రతకడం'. మనం ఏది ఎంపిక చేసుకుంటామో అలాగే బ్రతకాలంటారు. ఇతరుల కోసం బ్రతకలేం.. ఆ విలువ తెలియాలంటారు. ఎవరిమీద వారికి స్వాభిమానం ఉండాలంటారు. అయితే సమాజానికి తనవంతు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. అందుకే మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండరెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కరవు భత్యం కోసం పోరాడుతున్న తమిళ రైతులకు దిల్లీ వెళ్లి మద్దతు తెలిపారు. కరోనా కారణంగా పలువురు వలస కూలీలను తన ఫామ్ హౌస్‌లో ఆశ్రయం ఇచ్చి భోజన సదుపాయాలు కల్పించారు. యువత సాయంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయిన వారికి సాయం చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఆర్ఆర్ఆర్: రామరాజు నయా అవతార్ అప్డేట్