ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా.. త్వరలో రెండో పెళ్లి చేసుకోనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే సెప్టెంబరులో అతడి బిహార్‌కు చెందిన ఓ డాక్టర్‌ను వివాహం చేసుకున్నారని సమాచారం. ముంబయిలోని గ్రీన్ ఎకర్స్ ఇందుకు వేదికైందని తెలుస్తోంది. ఈ జంట ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటోందట.
అలా పరిచయం
గతంలో వెన్నెముకకు చికిత్స చేయించుకునేందుకు ప్రభుదేవా, సదరు ఫిజియోథెరపిస్టును కలిశారట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. కొంతకాలం డేటింగ్లో ఉన్న వీరిద్దరూ.. సెప్టెంబరులో రహస్య వివాహం చేసుకున్నారని ప్రభుదేవా సన్నిహితులు చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఆయన మేనేజర్ ధ్రువీకరించలేదు.
నయన్‌తో ప్రేమాయణం
ప్రభుదేవా, 1995లో రామలతను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. వారిలో పెద్ద కుమారుడు కాన్సర్‌తో 2008లో మరణించాడు. 2011లో రామలత నుంచి విడాకులు తీసుకున్నాడు ప్రభు. ఆ తర్వాత ఆయన నయనతారతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అనేక వివాదాల తర్వాత 2012లో వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరిగింది.