prabhas radheshyam producer : సాయి ప్రసీధ.. ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు పెద్ద కుమార్తె, పాన్ఇండియా స్టార్ ప్రభాస్ చెల్లెలు. తండ్రి, అన్నయ్యల సినిమాతో సినీ ప్రపంచానికి నిర్మాతగా పరిచయవుతున్నారు ప్రసీధ. పాన్ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ చిత్రాన్ని వంశీ, ప్రమోద్‌లతో కలిసి ప్రసీధ నిర్మించారు. శుక్రవారం ఆ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆమె చెప్పిన విశేషాలివే..
"సినిమా రంగంలోనే పుట్టి పెరిగాను కాబట్టి.. చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఆసక్తి. వ్యాపారంలోనే కొనసాగమని అమ్మ చెప్పేవారు. దాంతో లండన్ వెళ్లి బిజినెస్‌లో మాస్టర్స్ చేశా. ఆ తర్వాత అనుకోకుండా 'సాహో' సినిమాకి ఓ నెల రోజులపాటు పనిచేశా. అప్పుడే నాకు నిర్మాణంపై ఆసక్తి పెరిగింది. దాంతో అమెరికా వెళ్లి ప్రొడక్షన్ కోర్స్ చేశా. ఆ తర్వాత అక్కడే నెట్‌ఫ్లిక్స్‌లో కొన్నాళ్లు పనిచేశా. నా ఆసక్తి గురించి ప్రభాస్ అన్నయ్యకు చెబితే..నేనున్నా కదా, నువ్వు ఏం చేయాలనుకున్నా నా సహకారం ఉంటుంది. నాకు తెలిసిందల్లా నేర్పిస్తా. డాడీ నేర్పిస్తారంటూ ప్రోత్సహించారు. 'రాధేశ్యామ్' చాలా బాగా నచ్చింది. ప్రభాస్ అన్న, పూజా హెగ్డే జోడీ చాలా బాగుంటుంది. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చాలా బాగా తీశారు. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ పనితీరు బాగా నచ్చింది".
"ఒక అన్నయ్యగా ప్రభాస్‌ని రొమాంటిక్ సినిమాల్లో చూడటం ఇష్టం. 'డార్లింగ్' నాకు బాగా ఇష్టమైన చిత్రాల్లో ఒకటి. ఒక అభిమానిగా ఆయన యాక్షన్ సినిమాలు బాగా నచ్చుతుంటాయి. నిర్మాతగా నేను కెరీర్‌ని మొదలు పెట్టడానికి 'రాధేశ్యామ్' సరైన చిత్రం అనుకున్నా. నాన్న, అన్నయ్యా అదే నమ్మారు. మేం ఎన్నో కలలతో మొదలుపెట్టిన చిత్రం నాలుగేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తుండడంతో ఎంతో ఆత్రుతకి, మరెంతో ఉద్వేగానికి లోనవుతున్నా. తొలి రోజు ప్రేక్షకుల స్పందన విన్నాక కానీ.. నాలో ఆ ఉద్వేగం తగ్గదేమో (నవ్వుతూ). కొన్ని ఆటుపోట్లు ఎదురైనా నాన్నతోపాటు ప్రభాస్, ప్రమోద్ అన్నయ్యల మార్గనిర్దేశకంలో తొలి సినిమాని విజయవంతంగా పూర్తి చేశా. కరోనా రెండేళ్లపాటు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. దాని వల్ల ఓ కొత్త సాంకేతికతని తీసుకొచ్చాం. వర్చువల్ ప్రొడక్షన్ చేశాం. అన్‌రియల్ ఇంజిన్ అని హాలీవుడ్‌లో వాడే కొత్త సాంకేతికతని తీసుకొచ్చి ఇటలీనే ఇండియాకి తీసుకొచ్చి చిత్రీకరణ చేశాం. భవిష్యత్తులో ఈ సాంకేతికతని అందరూ వాడతారనే నమ్మకం ఉంది".
"నేను నిర్మాతనయ్యాను. మా చెల్లెలు ప్రకీర్తి ప్రభాస్ అన్నయ్య నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె'లో ప్రొడక్షన్ డిజైనింగ్ విభాగంలో పనిచేస్తోంది. తనకి కళ అంటే ఇష్టం. చాలా స్మార్ట్. నేను ఆ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్‌లో కొన్నాళ్లు పనిచేశా. నిర్మాతలు స్వప్న, ప్రియాంక నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఇక మా చిన్న చెల్లెలు ప్రదీప్తి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తోంది. తనకి సినిమా అంటే అంత ఆసక్తి లేదు. మా ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ప్రభాస్ అన్నయ్యతో ఎక్కువ చనువుగా ఉండేది.. ప్రకీర్తి. వాళ్లిద్దరూ బాగా క్లోజ్. ప్రభాస్ అన్న ఎంత బిజీగా ఉన్నా మా అందరికీ సమయం కేటాయిస్తారు. ఒక గంట కలుస్తా అంటారు. మేం అక్కడికి వెళ్లాక ఆ రోజు ఎన్ని పనులున్నా అవన్నీ వాయిదా పడిపోతుంటాయి (నవ్వుతూ). చిన్నప్పుడు ఏటా రాఖీ కోసం ఎదురు చూసేదాన్ని. ప్రభాస్ అన్నయ్య చాలా పెద్ద బొమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. అప్పట్నుంచి ఏటా ఒక దాన్ని మించి మరొకటి ఏదో ఒక సర్‌ప్రైజ్ ఉంటుంది. పోయిన ఏడాది సమయం లేదంటే, నేను ఇంటికి పంపిన రాఖీ కట్టుకునే ముంబయి వెళ్లారు. అన్నయ్య పెళ్లి గురించి అప్పుడప్పుడు ఇంట్లో ప్రస్తావన వస్తుంటుంది, మేమూ ఆట పట్టిస్తుంటాం. అన్నయ్యమో మొదట చెల్లెళ్ల పెళ్లి చేయాలని జోక్ చేస్తారు. పెళ్లనేది వ్యక్తిగత నిర్ణయం కదా".
- ప్రసీధ, కృష్ణంరాజు పెద్ద కుమార్తె
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: రాధేశ్యామ్ చిత్రానికి రాజమౌళి రిపేర్లు..!.. మార్పులుంటాయా?