వరుస షూటింగ్స్‌తో హీరో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'సలార్' చిత్రీకరణలో ఉన్న ఆయన త్వరలో 'ఆదిపురుష్' షూట్‌లో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 'ఆదిపురుష్' చిత్రీకరణ ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యే వరకూ ప్రభాస్ ఎక్కువ శాతం ముంబయిలోనే గడపనున్నారు. అక్కడ ఉన్నన్ని రోజులు హోటల్‌లో కాకుండా ఫ్లాట్‌లో ఉండాలని ఆయన భావిస్తున్నారట. దీంతో తన అభిరుచులకు తగ్గట్టుగా ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారట. ఈ మేరకు డార్లింగ్ బృందం ఇల్లు ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్, రష్మిక కూడా ముంబయికి మకాం మార్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
'ఆదిపురుష్' విషయానికి వస్తే.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. సీతగా కృతిసనన్ సందడి చేయనున్నట్లు సమాచారం. రామాయణంలో ముఖ్యమైన రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న సినిమాను విడుదల చేయనున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న 'ఆదిపురుష్' రోజువారీ షూట్ మరికొన్ని నెలల్లో ప్రారంభం కానుండడం వల్ల వీఎఫ్‌ఎక్స్, స్టైలింగ్, కాస్ట్యూమ్స్ పనుల్లో ప్రస్తుతం చిత్రబృందం పూర్తిగా నిమగ్నమైంది.