చిత్రపరిశ్రమలో ఒకే కుటుంబం నుంచి వచ్చి నటులుగా ఎదిగిన వారు చాలా మంది ఉండొచ్చు. కానీ, ఒకే కుటుంబం నుంచి వచ్చిన అన్నదమ్ములు హీరోలుగా నిలదొక్కుకున్నది మాత్రం అరుదు అని చెప్పుకొవచ్చు. ఉదాహరణకు నందమూరి తారకరామారావు కుమారులైన హరికృష్ణ, బాలకృష్ణ కూడా తమ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ హీరోగా వెలుగొందారు. అలా టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్న అన్నదమ్ములెవరో తెలుసుకుందామా!
చిరంజీవి-నాగబాబు-పవన్‌కల్యాణ్
చిరంజీవి.. 1978లో విడుదలైన 'ప్రాణం ఖరీదు' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత విభిన్న పాత్రలను పోషిస్తూ.. చిత్రపరిశ్రమలో అత్యధిక హిట్ గ్రాఫ్‌తో మెగాస్టార్‌గా ఎదిగారు. చిరు తర్వాత ఆయన సోదరులైన నాగబాబు, పవన్‌కల్యాణ్ కూడా అన్న బాటే పట్టారు. మొదటి తమ్ముడైన నాగేంద్ర బాబు కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించినా.. ఎక్కువ సినిమాల్లో మాత్రం సహాయక పాత్రల్లోనూ, నిర్మాతగానూ వ్యవహరించారు. అలాగే.. 1998లో విడుదలైన అక్కడ 'అమ్మాయి-ఇక్కడ అబ్బాయి' చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత తనదైన సినిమాలతో ప్రేక్షకుల మనసును చూరగొని పవర్‌స్టార్‌గా బిరుదు అందుకున్నారు.
కల్యాణ్‌రామ్-ఎన్టీఆర్
దివంగత నటుడు నందమూరి హరికృష్ణ కుమారులు కల్యాణ్ రామ్, తారక రామారావు (ఎన్టీఆర్). నందమూరి కల్యాణ్ రామ్ 2003లో చిత్రసీమలో అడుగుపెట్టగా.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన తొలిచిత్రం 'స్టూడెంట్ నం.1' సినిమాతో తారక్ హీరోగా పరిచయమయ్యారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్నారు.
అల్లు అర్జున్-అల్లు శిరీష్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారులైన అల్లు అర్జున్, అల్లు శిరీష్ తెలుగు ప్రేక్షకులకు హీరోలుగా సుపరిచితులే. ఆయన మరో కుమారుడైన అల్లు వెంకటేశ్ ప్రస్తుతం నిర్మాణబాధ్యతలు చేపడుతున్నారు. చిరంజీవి నటించిన 'డాడీ' చిత్రంలో తన డాన్స్‌తో ఆకట్టుకున్న అల్లు అర్జున్.. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు రూపొందించిన 'గంగోత్రి' చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలో హీరోగా పరిచయమయ్యారు. అతని సోదరుడైన అల్లు శిరీష్.. 'గౌరవం' సినిమాతో టాలీవుడ్లో హీరోగా అడుగుపెట్టారు. శిరీష్.. ఇటీవలే 'విలాయతీ షరాబ్' అనే హిందీ మ్యూజికల్‌లో నటించి, మెప్పించారు.
నాగచైతన్య- అఖిల్
కింగ్ అక్కినేని నాగార్జున నటవారసులు నాగచైతన్య, అఖిల్. ప్రముఖ దిల్‌రాజు నిర్మించిన 'జోష్' సినిమాతో నాగచైతన్య హీరోగా పరిచయమవ్వగా.. 'అఖిల్: పవర్ ఆఫ్ జువా' సినిమాతో హీరోగా అఖిల్ అరంగేట్రం చేశారు. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'మనం'(2014) చిత్రంలో నటించారు. లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరి చిత్రమిదే.
విజయ్-ఆనంద్
టాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో చిన్నచిన్న సహాయకపాత్రలు చేసుకుంటూ.. 'పెళ్లి చూపులు' చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నారు రౌడీహీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ విధంగా ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'లైగర్' చిత్రంతో పాన్ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
విజయ్ దేవరకొండ సోదరుడైన ఆనంద్ దేవరకొండ.. 'దొరసాని' చిత్రంతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయినా.. ఆ తర్వాత విడుదలైన 'మిడిల్‌క్లాస్ మెలోడీస్' ఫర్వాలేదనిపించారు. ప్రస్తుతం ఆనంద్.. 'పుష్పక విమానం' అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఆయన సోదరుడు విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సాయి తేజ్-వైష్ణవ్ తేజ్
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో హీరో ద్వయం సాయి తేజ్-వైష్ణవ్ తేజ్. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మించిన 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు సాయిధరమ్ తేజ్. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ.. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్‌లోనూ తన మేనమామలైన చిరంజీవి-పవన్ కల్యాణ్ పోలికలతో మరింతగా ఆకట్టుకున్నారు. ఆ విధంగా సుప్రీం హీరోగా ఎదిగారు. ఇటీవలే విడుదల 'ఉప్పెన' చిత్రంతో కథానాయకుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టారు వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయాన్ని మూటకట్టుకుంది.
ఇదీ చూడండి: అందాల తారల సొగసు చూడతరమా!