టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ చేసిన ఆర్థిక సాయంతో.. ఓ యువకుడు అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో అదరగొట్టేశాడు. అంతేకాదు పసిడి పతకాన్నీ సొంతం చేసుకున్నాడు.
'దేవర' సాయం..
మెదక్ జిల్లాకు చెందిన గణేష్ ఎంబారీ.. న్యూదిల్లీలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనాలనుకున్నాడు. ఆ పోటీలకు వెళ్లేందుకు ఎంట్రీ ఫీజు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఈ క్రమంలో గణేష్ ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్న విజయ్ దేవరకొండ.. తనకు చెందిన 'దేవర ఫౌండేషన్' తరఫున ఎంట్రీ ఫీజుకు కావాల్సిన 24 వేల రూపాయలను అందించాడు. 'దేవర ఫౌండేషన్' అందించిన ఆర్థిక సాయంతో గణేష్ పోటీల్లో పాల్గొన్నాడు. అలా ఫిబ్రవరి 13న జరిగిన ఫైనల్లో.. విజేతగా నిలిచి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు.
తాజాగా మెడల్‌తో ఉన్న ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన గణేష్.. సాయం అందించిన విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

"వాకో ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2020. థ్యాంక్యూ విజయ్ దేరకొండ. మీ ఆర్థికసాయం, సపోర్ట్ లేకుంటే నేను ఈ విజయాన్ని పొందలేకపోయేవాడిని. మీరు రియల్ హీరో" అని గణేష్ పేర్కొన్నాడు.
గణేష్ ట్వీట్ చూసిన విజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "నువ్వు గెలిచావ్ గణేష్. నిన్వు చూస్తుంటే గర్వంగా ఉంది. నిన్ను కలవాలనుకుంటున్నాను. రౌడీ కుటుంబంలోకి నీకు స్వాగతం" అని రిప్లై ఇచ్చాడు.