బాలీవుడ్ నటి పూనమ్ పాండే తన భర్త సామ్‌బాంబేతో మళ్లీ జీవితాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈ సెప్టెంబర్ 10న పెళ్లి చేసుకున్నారు. ఈ శుభవార్తను తెలియజేస్తూ తన పెళ్లి ఫొటోలను అప్పట్లో పోస్ట్ చేసింది పూనమ్. వివాహానంతరం కలిసి గోవాకూ వెళ్లారు. అయితే పెళ్లయిన 13 రోజులకే.. సామ్‌బాంబే తనను శారీరకంగా హింసిస్తున్నారని పూనమ్ పనాజీ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సామ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతను బెయిల్‌పై బయటకు వచ్చారు.
ఈ నేపథ్యంలో పూనమ్.. తన భర్తతో తిరిగి కలుస్తున్నానని వెల్లడించింది. సామ్ కూడా పెళ్లి ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసి.. చిన్న చిన్న గొడవలు అనంతరం జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
"ఇప్పటివరకూ జరిగిన విషయాలన్నింటినీ మర్చిపోయి మా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే మళ్లీ మేమిద్దరం కలిశాం. మా ఇద్దరి మధ్య ప్రేమ, గౌరవం ఉంది. గొడవలు, మనస్పర్థలు లేకుండా ఏ వివాహబంధం ఉంది?" అని పూనమ్ తెలిపారు. తమ మధ్య ఉన్న గొడవలు ఈనాటితో పోయాయని.. ఇకపై తాము మరెంతో సంతోషంగా ఉంటామని సామ్ అన్నారు.