తెలుగులో పాన్ ఇండియా సినిమాల హవా 'బాహుబలి' వరుస చిత్రాలతోనే మొదలైంది. అవి సాధించిన విజయం, వసూళ్లు మరింత ధైర్యంగా అడుగేయడానికి కారణమయ్యాయి. విశ్వజనీనమైన కథ ఉందనకుంటే చాలు.. దాన్ని ఒక భాషకో, ప్రాంతానికో పరిమితం చేయడానికి ఇష్టపడటం లేదు దర్శకనిర్మాతలు. మరిన్ని హంగులు జోడించి దానికి పాన్ ఇండియా కలర్ ఇస్తున్నారు. దాంతో వాటి స్థాయి, మార్కెట్ మరింత విస్తృతం అవుతోంది. అలా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువవ్వడమే లక్ష్యంగా చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటికి బాలీవుడ్ మద్దతూ లభిస్తోంది.
తీస్తే.. అలానే తీయాలి
'బాహుబలి'కి ముందు రజనీకాంత్, కమల్‌హాసన్ లాంటి అగ్ర తారల సినిమాలకి మినహా.. దక్షిణాది చిత్రాలకి హిందీలో పెద్దగా మార్కెట్ ఉండేది కాదు. 'బాహుబలి', 'బాహుబలి: ది కన్‌క్లూజన్', 'కేజీఎఫ్' చిత్రాల తర్వాత దక్షిణాది సినిమా అనగానే దాన్ని బాలీవుడ్ మార్కెట్ ప్రత్యేక దృష్టితో చూడటం మొదలుపెట్టింది. అది దక్షిణాది చిత్ర పరిశ్రమలకి కొండంత ఉత్సాహాన్నిచ్చింది. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రభావితం చేయలేకపోయినా సరే.. దక్షిణాదిలో 'పాన్ ఇండియా' ఉత్సాహం తగ్గలేదు. నిర్మాతలు తీస్తే ఆ స్థాయి సినిమానే తీయాలనే కోవలో బడ్జెట్లు కేటాయించారు. కథానాయకులు సైతం బహుభాషల్లో మార్కెట్ ఏర్పాటైతే లభించే గుర్తింపే వేరు కదా? అని ఆ దిశగానే అడుగులేయడం మొదలుపెట్టారు.
అదే బాటలో చాలామంది
'బాహుబలి' చిత్రాలతో భాషల మధ్య సరిహద్దులు చెరిగిపోయాక.. 'సైరా నరసింహారెడ్డి', 'సాహో' సినిమాలు ఆ పరంపరని కొనసాగించాయి. క్రిష్ తెరకెక్కించనున్న సినిమాతో పవన్ కల్యాణ్, 'పుష్ప'తో అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, 'అహం బ్రహ్మాస్మి'తో మంచు మనోజ్ పాన్ ఇండియా చిత్రాల్ని ప్రకటించారు. పూరి జగన్నాథ్ తదుపరి చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కబోతుంది. మంచు విష్ణు 'మోసగాళ్లు' అంతర్జాతీయ హంగులతో రూపొందుతోంది. ఇక ప్రభాస్, రాజమౌళి చిత్రాలు ఎలాగో ఆ స్థాయిలోనే ఉంటాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ప్రభాస్ 20వ చిత్రం, నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న 21వ చిత్రం, ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' పాన్ ఇండియా స్థాయిలోనే ఉండబోతున్నాయి.
కరోనాతో భయాలు.. అయినా!
ఇలా అంతా సవ్యమే అనుకుంటున్న తరుణంలో కరోనా పరిశ్రమని అతలాకుతలం చేసింది. ఓవర్సీస్ మార్కెట్ ఎప్పుడు కోలుకుంటుందో అర్థం కాని పరిస్థితి. థియేటర్లకి జనం మునుపటిలా వస్తారో లేదో అనే సందిగ్ధం. ఈ భయాలతో ఇకపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కే పాన్ ఇండియా చిత్రాలకి కాలం చెల్లినట్టే అనుకున్నాయి సినీ వ్యాపార వర్గాలు. ఆ ప్రభావం ఏమాత్రం లేనట్టుగా ఇప్పటికీ వరుసగా పాన్ ఇండియా సినిమాల్ని ప్రకటిస్తున్నారు నిర్మాతలు. సెట్స్‌పైకి వెళ్లిన సినిమాల విషయంలోనూ రాజీపడటం లేదు. కరణం మల్లేశ్వరి బయోపిక్‌తోపాటు 'కార్తికేయ2', 'మేజర్', రానా నటించబోయే 'హిరణ్య'... ఇలా పలు చిత్రాలు పాన్ ఇండియా ముద్రతో సెట్స్‌పైకి వెళుతున్నాయి.
ఓటీటీ ప్రభావంతో..
టెలివిజన్ వచ్చాక కుటుంబ ప్రేక్షకులు కొందరు ఇంటికే పరిమితమైనట్టుగా.. ఓటీటీ వేదికలు అందుబాటులోకి వచ్చాక ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్‌కి రావడం తగ్గింది. వాళ్లంతా అద్భుతమైన సినిమా వచ్చిందనుకుంటే తప్ప బాక్సాఫీసు వైపు చూడటం లేదు. దాంతో చిత్ర పరిశ్రమ వ్యూహం మార్చింది. 'అంతకుమించి..' అనేలా సినిమాలు రూపొందించడం మొదలు పెట్టింది. థియేటర్ అనుభూతిని ఇవ్వడం కోసం భారీ స్థాయి సినిమాలు రూపొందిస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ కొన్నేళ్లుగా అదే వ్యూహంతో అడుగులేస్తోంది. మార్కెట్‌తో సంబంధం లేకుండా.. కథ కోరుకుందంటే ఒకింత ఎక్కువ బడ్జెట్లే కేటాయిస్తూ సినిమాలు రూపొందిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రేక్షకులకి.. ఆ మార్కెట్‌కి చేరువవుదామనే ఆలోచనతో ముందుకెళుతోంది.