"తొలి దశ కరోనా తగ్గగానే ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. రెండో దశ తర్వాతా అదే తరహాలో వసూళ్లు వస్తాయి. సినిమా వినోదానికి మరో ప్రత్యామ్నాయం లేదు" అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. లక్కీ మీడియా పతాకంపై 15 సంవత్సరాలుగా సినిమాలు నిర్మిస్తున్నారాయన.
'టాటా బిర్లా మధ్యలో లైలా' మొదలుకొని పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు. ప్రస్తుతం విష్వక్‌సేన్ కథానాయకుడిగా 'పాగల్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు, సోహైల్‌లతోనూ సినిమాల్ని ఆరంభించారు. మంగళవారం బెక్కం వేణుగోపాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన కొత్త సినిమాల విశేషాల్ని, సినీ ప్రయాణాన్ని విలేకర్లతో పంచుకున్నారు. ''నవరసాల మేళవింపుగా రూపొందుతున్న చిత్రం పాగల్. నిర్మాత దిల్‌రాజు సహకారంతోనే సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా ఓ కొత్త రకమైన అనుభవాన్నిచ్చింది. విజయవంతమైన హుషారు తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న పాగల్ తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మా నిర్మాణ సంస్థని ఆరంభించి 15 యేళ్లయింది. ఇన్నేళ్లుగా సినిమాలు తీస్తూ, ఎంతోమంది గొప్ప వ్యక్తులతో కలిసి ప్రయాణం చేస్తుండడం నా అదృష్టం'' అన్నారు బెక్కం వేణుగోపాల్. కరోనా తగ్గగానే 'పాగల్' చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారాయన.