శ్రమైక జీవనమే ప్రముఖ సినీ కథానాయకుడు చిరంజీవి విజయానికి సోపానమని ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా అవతరించారని ప్రశంసించాడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ జనసేనాని ఓ భావోద్వేగ సందేశంతో ప్రకటనను విడుదల చేశారు.
అన్నయ్యే నా తొలి గురువు!
"అన్నయ్య చిరంజీవి నా స్ఫూర్తి ప్రదాత. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత ఆరాధిస్తానో చిరంజీవిని అంతలా పూజ్యభావంతో ప్రేమిస్తాను. నా అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం. అన్నయ్య చేయిపట్టి పెరిగాను. ఒకవిధంగా చెప్పాలంటే అన్నయ్యే నా తొలి గురువు. అమ్మలా లాలించారు. నాన్నలా మార్గదర్శిగా నిలిచారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పెద్దల మాటలు అన్నయ్యను చూస్తే నిజమనిపిస్తాయి. అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించారు. తెలుగు వారు సగర్వంగా "చిరంజీవి మావాడు" అని చెప్పుకొనేలా తనను తాను మలచుకున్నారు.
తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం
సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఓ సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగి, నాలాంటివారెందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. కష్టాన్ని నమ్ముకున్నారు. సముచిత స్థానానికి చేరుకున్నారు. చిన్న పాయగా ఉద్భవించే నది అఖండ రూపాన్ని సంతరించుకున్నట్టుగా అన్నయ్య ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అలవరచుకున్నారు. ఆయన ఎదుగుదల ఆయనలోని సేవాతత్పరతను ఆవిష్కరింపజేసింది. ఆయనలా నటుడవుదామని, ఆయనలా అ భినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే, ఆయనలా సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారు. తన అభిమానులకు సేవ అనే సత్కార్యానికి దారి చూపారు. ఎందరో ఆ దారిలో పయనిస్తూ నేడు సమాజంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆపన్నులకు అండగా ఉంటున్నారు. అటువంటి కృషీవలుడికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. నేడు చిరంజీవి జన్మదినం. ఈ సందర్భంగా ఆయనను తెలుగువారందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆయనకు చిరాయువుతో కూడిన శుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అన్నయ్యకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.