ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. 'ఎన్టీఆర్ 30' వర్కింగ్ టైటిల్‌గా నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యుధసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుధాకర్ మిక్కిలినేని నిర్మాత. చిత్ర కథ అంతా విద్యార్థి రాజకీయాల చుట్టూ తిరగనుందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్ పాడవ్వకూడదనే ఉద్దేశంతో బరిలోకి దిగిన ఆ కథానాయకుడికి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా అధిగమిస్తాడు? తుదకు తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? లేదా? అనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో కొవిడ్ రెండో దశతో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ కరోనా ఉద్ధృతి తగ్గగానే సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉండనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించడం కొత్తేమీ కాదు గతంలో ఆయన ఎ.ఎమ్.రత్నం నిర్మించిన 'నాగ' చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో నటిస్తున్నారు.