నటనా ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటానని చెబుతోంది నటి నివేదా పేతురాజ్. సినిమా ఫలితాన్ని ఆశించి రంగంలోకి దిగనని అంటోంది. ఈ ఏడాది సంక్రాంతికి 'రెడ్' చిత్రంతో సందడి చేసిన ఆమె.. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'పాగల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈనెల 14న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది నివేదా పేతురాజ్.
"రెండేళ్ల క్రితం నేను ఈ కథ విన్నా. నరేష్ కథ చెప్పినప్పుడే.. బాగా నచ్చేసింది. ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయా. కొన్ని సన్నివేశాలు వింటున్నప్పుడే కంటతడి పెట్టించేశాయి. దీంతో వెంటనే చేస్తానని చెప్పా. దీనికితోడు దిల్‌రాజు, బెక్కం వేణుగోపాల్ లాంటి నిర్మాతలు ఈ సినిమా టేకప్ చేస్తుండటం వల్ల సినిమాపై ముందు నుంచి ఓ నమ్మకం ఏర్పడింది. నేనిందులో తీర అనే అమ్మాయిగా కనిపిస్తా. విశ్వక్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇందులో మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. 'సఖి' చిత్రంలో మాధవన్, షాలిని మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో.. ఇందులో మా మధ్య అలాంటి ఎమోషన్సే కనిపిస్తాయి."
-నివేదా పేతురాజ్
"నేను ఈ మధ్యనే రేసింగ్‌లో ఫస్ట్ లెవల్ పూర్తి చేశాను. రేసింగ్ లొకేషన్‌కు వెళ్లానంటే.. సినిమా అంటే ఏమిటో పూర్తిగా మర్చిపోతా. ప్రస్తుతం నేను తెలుగులో 'విరాటపర్వం' చిత్రంలో నటిస్తున్నా. డిసెంబరులో మరో తెలుగు సినిమా చేయబోతున్నా. తమిళంలో మూడు ప్రాజెక్ట్‌లు చేస్తున్నాను" అని నివేదా వెల్లడించింది.
"ప్రేమలో ఉన్న వాళ్లందరూ ఈ సినిమాతో కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ప్రేమించినప్పుడు కొంత మంది పిచ్చోళ్లలా ఆలోచిస్తుంటారు కదా. అలాంటి ఓ కుర్రాడి ప్రేమకథతోనే ఈ చిత్రం తెరకెక్కించారు. సినిమా చూశాక.. ఇలాంటి స్క్రిప్ట్ రాయడానికి దర్శకుడెంత పాగల్‌లా.. ఫ్యాషన్‌తో ఆలోచించి ఉంటాడో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది" అని నివేదా తెలిపింది.
ఇదీ చదవండి: దీపికా పదుకొణె 'బాడీగార్డ్' జీతం ఎంతో తెలుసా?