వైవిధ్యభరిత కథలతో వచ్చే కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు యువ కథానాయకులు నితిన్, శర్వానంద్. వీళ్లిద్దరూ ప్రస్తుతం ఓ ఇద్దరు కొత్త దర్శకులకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.
అయితే ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. నితిన్ ఓ చిత్రం పట్టాలెక్కించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. 'బిజినెస్‌మెన్', 'టెంపర్', 'లై' వంటి సినిమాకు ఎడిటర్‌గా పనిచేశాడు శేఖర్. ఇతడు ఇటీవల నితిన్‌కు ఓ కథ వినిపించినట్లు తెలిసింది. ఈ స్క్రిప్ట్ ఆయనకి నచ్చడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
లఘు చిత్రం నుంచి..
ఇటీవలే 'శ్రీకారం' చిత్రంతో బి.కిషోర్ అనే కొత్త దర్శకుడ్ని తెరకు పరిచయం చేశాడు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం', కిషోర్ తిరుమలతో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలు చేస్తున్నాడు. దీంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇవన్నీ చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. ఇప్పుడివి సెట్స్‌పై ఉండగానే శర్వా మరో కొత్త చిత్రానికి సంతకం చేశాడని సమాచారం. ఈ సినిమాతో దీపక్ రెడ్డి అనే ఓ కొత్త దర్శకుడ్ని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
'మనసా నమహా' అనే లఘు చిత్రంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు దీపక్. ఇతనితో యూవీ క్రియేషన్స్ శర్వాకి ఓ కథ చెప్పించిందని, ఆయనకి నచ్చడం వల్ల ఈ సినిమాకు అంగీకారం తెలిపాడని ప్రచారం వినిపిస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇదీ చదవండి : 'షోలే' రికార్డు బ్రేక్ చేసిన 'గదర్'కు 20 ఏళ్లు