తెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నారు నిఖిల్ (nikhil siddharth). రెండో దశ కరోనా విపత్తులో ఎంతోమంది బాధితులకి అండగా నిలిచారీ యువకిశోరం. వైద్యం కోసం ఆర్థిక సాయం చేశారు. స్వయంగా ఆస్పత్రులకి వెళ్లారు. బాధితులకి అవసరమైన వైద్య సదుపాయాలు.. ఔషధాలు అందేలా చేశారు. ఎంతోమంది కన్నీళ్లని తుడిచారు. మంగళవారం నిఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో 'ఈటీవీ భారత్' ముచ్చటించింది. ఆ విషయాలు మీకోసం.
ఈ లాక్‌డౌన్ మొత్తం కరోనా బాధితులకి సాయం చేస్తూనే గడిపినట్టున్నారు?
మనకు తెలియని హీరోలు అంటుంటాం కదా. అలాంటివాళ్లు చాలా మందే ఉన్నారనేది ఈ లాక్‌డౌన్‌తో మరోసారి తెలిసింది. కొద్దిమంది యువకులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు.. ఇలా మనిషికి మనిషి సాయం అన్నట్టుగా చాలా మందే కరోనా బాధితులకు అండగా నిలిచారు. వాళ్లలో నేనొక్కడిగా చేరిపోయా. ఈ లాక్‌డౌన్‌లో నేనొక సినిమా హీరో అనే విషయాన్నే మరిచిపోయా. ఈసారి జిమ్ చేయడం కూడా మానేశా. నాలుగైదు రోజులు నిద్రకూడా లేకుండా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న కొద్దిమంది వ్యక్తుల్ని నేను చూశా.
సహాయ కార్యక్రమాలకి మీరొక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారా?
సోషల్ మీడియానే ఓ పెద్ద టీమ్. దాంతోపాటు సినిమాల ప్రమోషన్స్ సమయంలో నేను రాష్ట్రమంతా తిరుగుతుంటా. అలా నాకు చాలా ప్రాంతాల్లో స్నేహితులు ఏర్పడ్డారు. వాళ్ల ద్వారా నేను బాధితుల్ని చేరుకోగలిగా, సాయం అందించా. కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక బాధితులు ఫొటోలు, వీడియోలు పంపిస్తూ కృతజ్ఞతలు చెబుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో కాకుండా, నా మనసులో దాచుకోవాలనిపించింది. మేం సాయం చేసిన వందల మందిలో కోలుకోలేక ప్రాణాలు కోల్పోయినవాళ్లు యాభై మంది దాకా ఉంటారు. మొన్ననే తిరుపతిలో ఒక గర్భిణి వైద్యం కోసం ఏం చేయాలో చేశాం. అన్నా అన్నా.. అంటూ రాత్రి ఫోన్‌లో కూడా మాట్లాడింది. ఉదయం లేచేసరికి ఆమె లేదనే విషయం తెలిసింది. అలాంటి ఘటనలు మనసుని కలిచివేశాయి. నా భార్య పల్లవి కూడా డాక్టరే కాబట్టి.. ఆమెకి ఫోన్ కాల్స్ వస్తూనే ఉండేవి. తనూ నాకు సాయం చేసింది. నాతోపాటే ఆస్పత్రులకూ వచ్చి బాధితులకి ధైర్యం చెప్పింది.
నిఖిల్ ఎక్కువగా ఫాలో అయ్యే స్టార్స్ ఎవరంటే?
ఈసారి పుట్టినరోజు విశేషాలేమిటి?
పుట్టినరోజు పండగ జరుపుకొనేంత ఉత్సాహం లేదు. కాకపోతే కొంచెంలో కొంచెం సంతోషాన్నిచ్చే విషయం.. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం. ఈ రెండు మూడు రోజులుగా సాయం కోసం సోషల్ మీడియాలో నాకొచ్చే రిక్వెస్ట్‌ల సంఖ్య బాగా తగ్గింది. ఈరోజైతే పొద్దున్నుంచి ఒక్క విన్నపం రాలేదు. జనాలకి అవసరం అనేది తగ్గిపోయిందనే చిన్న సంతోషం ఉంది.
'18 పేజీస్' (18 pages) ఎలా ఉండనుంది?
థ్రిల్లర్ సినిమాలు, మిస్టరీ, అడ్వంచర్ చిత్రాలు చేస్తూ వచ్చాను నేను. ప్రేమకథలంటే మొదట్నుంచీ భయం నాకు. ప్రేమకథ అంటే విడిపోవడం, కలవడమే కదా అనిపిస్తుంటుంది. కానీ సుకుమార్ కథలు భిన్నంగా ఉంటాయి. ఇక సుకుమార్ రైటింగ్స్‌కి, జీఏ2 బన్నీ వాస్ తోడయ్యారంటే అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కథ వినగానే నాకు భలే అనిపించింది. వెంటనే సినిమా చేయడానికి అంగీకారం తెలిపా.
కొత్త సినిమాల కబుర్లేమిటి?
చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న 'కార్తికేయ2' తర్వాత, సుధీర్‌వర్మ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత ఒక స్పై సినిమా చేయనున్నా. ఏషియన్ సంస్థలోనూ ఓ సినిమాకి సంతకం చేశా.
మొత్తంగా పెళ్లి తర్వాత ప్రేమకథ చేస్తున్నారు..!
ఇదివరకు చేసిన కొన్ని సినిమాల్లో ప్రేమ ఉండేది కానీ.. పూర్తిస్థాయి ప్రేమకథ చేయడం ఇప్పుడే. కొన్ని సన్నివేశాల్లో పల్లవిని ఊహించుకునే నటించా. పెళ్లి తర్వాత ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం మరింత సులభమైందేమో అనిపిస్తుంది (నవ్వుతూ).
ప్రేమకథలంటే ఎందుకు అంత భయం?
కథ పరంగా నాకు కామెడీ అయినా ఉండాలి. లేదంటే సినిమా ఆద్యంతం మలుపులతో ఉత్కంఠగానైనా సాగాలి. ప్రేమకథల్లో 'ఖుషీ' తరహా సినిమాలంటే ఇష్టమే కానీ నన్ను ప్రేక్షకులు లవర్‌బాయ్‌గా ఎంతవరకు స్వీకరిస్తారో అనే భయం ఉండేది. సుకుమార్ సర్ రాసిన '18 పేజీస్' కథలో నన్ను నేను చూసుకోగలిగా. నా శైలి మలుపులు కూడా ఇందులో కనిపించాయి.