మాగంటి మురళీమోహన్... తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో అనుభవమున్న సీనియర్ నటులు. నిర్మాత. వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. 'జగమే మాయ' చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసి ఎన్నో పాత్రలకు జీవం పోశారు. రాజమహేంద్రవరానికి ఎంపీగా పనిచేశారు. పదేళ్లుగా సినిమా రంగానికి దూరంగా ఉన్న ఆయన.. మళ్లీ దృష్టి సారించారు. రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికి తన సొంత నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్స్‌లో సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా 2021లో కొత్త ప్రయాణంపై మురళీమోహన్ 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా మాట్లాడారు.
"2021లో నిజంగానే నాది కొత్త ప్రయాణం. మొదటి సినిమాకు కలిగిన అనుభూతి ఇప్పుడు మళ్లీ కలుగుతుంది. ప్రస్తుతం పరిశ్రమ మారిపోయింది. కథలు మారాయి. మేం రాకముందు జానపద, కాకమ్మ కథల సినిమాలు ఉండేవి. మేం వచ్చాక కుటుంబ కథా, ప్రేమ కథా చిత్రాలు మొదలయ్యాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీస్తున్నారు. రూ100, 200, 500 కోట్ల బడ్జెట్‌లో సినిమా నిర్మాణాలు జరుగుతున్నాయి. పరిశ్రమలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనమూ నటనను మార్చుకుంటేనే మనుగడ. నా వయస్సుకు తగిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ నటిస్తుంటాను. 10 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్నాను. రెండేళ్ల కిందట బాలకృష్ణ నటించిన 'జైసింహా' చిత్రంలో కనిపించినా పెద్దగా ఆదరణ దక్కలేదు. తాజాగా ఆర్కా మీడియా నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ కథ బాగా నచ్చింది. అందులో జగపతిబాబు, శరత్ కుమార్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. వారికి తండ్రి పాత్రలో నటిస్తున్నాను"

కొత్త కథలతో...
ఇప్పటి వరకు మా జయభేరి ఆర్ట్స్‌లో 25 సినిమాలు నిర్మించాం. 'అతడు' మా చివరి సినిమా. ఆ తర్వాత నేను వ్యాపార, రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండటం కారణంగా సినిమాలు తీయలేకపోయా. ఇకపై నా దృష్టంతా నటన, సినిమా నిర్మాణంపైనే. అయితే సినిమాలు ఎంతలో తీయాలి, చిన్న బడ్జెట్టా? పెద్ద బడ్జెట్టా? అనేది చర్చిస్తున్నాం. ఓటీటీ కోసం వెబ్ సిరీస్ లా? సినిమాలా? అనేదీ ఆలోచిస్తున్నాం. ఏదో ఒకటి త్వరలోనే మొదలు పెడతాం. ఇప్పుడు సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు వస్తున్నాయి. అయితే కొత్తగా వచ్చే సినిమాల్లో కొంచెం క్రైమ్ ఎక్కువగా ఉంటుంది. ప్రేక్షకులు ఏది ఆదరిస్తారో వాటినే తీయాలనుకుంటున్నాం.
ఖర్చు తగ్గించాలి
ఏ సినిమా అయినా దర్శకుడు, కథానాయకుడిపై ఆధారపడి వ్యాపారం ఉంటుంది. క్యారెక్టర్ నటీనటుల విషయంలో మాత్రం కాదు. నన్ను పెట్టినా కన్నడ, మలయాళం, హిందీ నుంచి తీసుకొచ్చినా వ్యాపార పరంగా పెద్దగా మార్పు ఉండదు. కానీ మనవాళ్లు ఎక్కడెక్కడి నుంచో క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు. వాళ్లకు పారితోషకాలు, విమాన ఛార్జీలు, విలాసవంతమైన వసతులు కల్పిస్తూ బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు. బడ్జెట్ ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గిస్తూ ఎక్కడ పెంచుకోవాలో అక్కడ పెంచుకుంటే సినిమా నిర్మాణం బాగుంటుంది. సినిమా అంటే కోట్లు గుమ్మరించి రూపాయిలు ఏరుకోవాలి. ఖర్చు తగ్గించుకుంటే ఆదాయం వచ్చినట్టే.

రాజకీయాలకు ఇక గుడ్ బై
ఇక నుంచి నాకూ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. నా దృష్టంతా నటన, సినిమా నిర్మాణంపైనే. సినిమాల నుంచే ఎదిగాం. కాబట్టి దాన్ని మరిచిపోను. మళ్లీ సినిమా రంగంలోనే ఉండాలని ఆలోచించాను. వ్యాపారాలు మా తమ్ముడు, పిల్లలకు అప్పగించాను. ఇటీవల వెన్నెముక శస్త్ర చికిత్స జరిగింది. దాన్ని నుంచి పూర్తిగా కోలుకున్నాను. మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.