అమ్మ-నాన్న, అక్కా, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ఎన్నో బంధాలతో మనల్ని కలిపిన దేవుడు స్నేహితుడిని ఎందుకు దూరం పెట్టాడో అర్థం కాదు. ఆలోచిస్తే అది బంధం కాదు భావోద్వేగమని అర్థమౌతుంది. పరీక్షల్లో ఫెయిలైతే 'లైట్ రా' అంటూ ధైర్యం చెబుతాడు.. క్లాస్ బంక్‌లు కొట్టిస్తాడు.. భవిష్యత్తుపై భరోసానూ కలిగిస్తాడు.. అవసరమైతే కాస్త కఠినంగానూ ఉంటాడు! ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్షిప్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని సినిమాలు ఇప్పుడు చూద్దాం!
హ్యాపీడేస్
'పాదమెటుపోతున్నా.. పయనమెందాకైనా' అంటూ సాగే ఈ పాట వింటే చాలు స్నేహం విలువేంటో తెలుస్తుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ చిత్రం వాస్తవికానికి దగ్గరగా ఉంటుంది. ఇందులో ప్రేమ, ఆప్యాయతలను చక్కగా చూపించాడు దర్శకుడు. ఈ సినిమా చూసే.. ఇంజినీరింగ్ కోర్సు చదివిన వారున్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా యువతపై ప్రభావం చూపిందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఉన్నది ఒకటే జిందగీ..
"ట్రెండు మారినా ఫ్రెండు మారడే" అంటూ స్నేహానికి సరికొత్త నిర్వచనం తెలిపిన చిత్రం ఉన్నది 'ఒకటే జిందగీ'. స్నేహితుడు ఎందుకు ముఖ్యమో ఈ సినిమా చాటిచెప్పింది. ఆమోదయోగ్యమైన సంభాషణలతో, ఆకట్టుకునే పాటలతో స్నేహాన్ని, ప్రేమను బ్యాలెన్స్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. "మన కథలు చెబితే వినేవాడు ఫ్రెండ్.. కానీ ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్" లాంటి డైలాగ్‌లతో సినీ ప్రియుల్ని అలరించిందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
స్నేహంకోసం
పది మందిలో వీడు నా స్నేహితుడు అని గర్వంగా చెబితే.. అతడి కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. ఇదే కథాంశంతో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం.. 'స్నేహం కోసం'. మిత్రుడి కుటుంబం బాగుండాలని తన జీవితాన్నే త్యాగం చేస్తాడు హీరో. ఈ సినిమాలో చిరు నటనకు ప్రేక్షకులు దాసోహం అయిపోతారు. పతాక సన్నివేశంలో వచ్చే పాట చూసి కంటతడి పెట్టని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! అంతగా ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేసేలా ఉంటుందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రేమదేశం
ఈ సినిమాలో ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో.. స్నేహానికి అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించినపుడు వారి మధ్య తలెత్తే సంఘర్షణలు, సంఘటనలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించారు. 90ల్లో వచ్చిన ఈ మూవీ కళాశాల స్నేహానికి అద్దం పట్టింది. కాలేజీ స్నేహం ఎప్పటికీ అంతం కానిది అంటూ చాటి చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కథానాయకుడు
రజినీకాంత్, జగపతిబాబు నటించిన 'కథానాయకుడు' చిత్రం స్నేహంపై వచ్చిన ఉత్తమ సినిమాల్లో ఒకటి. మీకో మంచి స్నేహితుడు కావాలంటే బాల్యంలోనే ఎంచుకోవాలని చెబుతూ స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పిందీ సినిమా. క్లైమాక్స్‌లో రజినీ, జగపతిబాబు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇద్దరు
ప్రముఖ రాజకీయనాయకుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం స్నేహంలో వైరం ఎలా ఉంటుందో చూపించింది. స్వతహాగా ఇద్దరూ ప్రాణ స్నేహితులు.. వారి సిద్ధాంతాలు వారిని వేరు వేరుగా ఉండేలా చేస్తాయి. మనసులో ఆప్తులమనే భావన ఉంటూనే.. బయటకు మాత్రం రాజకీయ చతురతలు, వ్యూహాలు ప్రదర్శిస్తారు. వ్యక్తిగతంగా స్నేహితులు గాను.. రాజకీయంగా శత్రువుల్లా ఉంటారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ప్రకాశ్ రాజ్, మోహన్‌లాల్ తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇంకా మరెన్నో సినిమాలు స్నేహం విలువను చాటిచెప్పాయి. ఏది ఏమైనా స్నేహితుడు.. కష్టాల్లో తోడుంటాడు.. సంతోషాన్ని పంచుకుంటాడు.. స్వార్థం లేని ఏకైక బంధువు.. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి మిత్రుడు అనే పదాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే మన బంధం కాదు.. కానీ ఎప్పుడూ మనతోనే ఉండే అనుబంధం.
ఇది చదవండి: రామ్ చరణ్‌తో స్నేహంపై జూ. ఎన్టీఆర్ ఇలా...