కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మూతపడ్డాయి. వైరస్ ప్రభావం కాస్త తగ్గడం వల్ల మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. దీంతో కొన్ని సినిమాలు బిగ్‌స్క్రీన్స్‌పై సందడి చేశాయి. లాక్డౌన్ తర్వాత ప్రేక్షకులు వినోదాన్ని కోరుకోవడం వల్ల సినిమా టికెట్లకు గిరాకీ పెరిగింది. తాజాగా బుక్ మై షో చెబుతున్న ప్రకారం లాక్డౌన్ తర్వాత ఎక్కువ మంది థియేటర్లలో చూసిన సినిమాగా హాలీవుడ్ మూవీ 'టెనెట్' నిలిచింది.
అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 18 వరకు ఈ సినిమా టికెట్లు 3 లక్షలకు పైగా అమ్ముడుపోయాయట. షో ఆఫ్ ది ఇయర్ అనే రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించింది బుక్ మై షో. ఎక్కువ మంది చూసిన చిత్రాల్లో తర్వాత స్థానాల్లో బిస్కోత్ (తమిళం), ఇరండామ్ కుత్తు (తమిళం), సూరజ్ పే మంగల్ భారీ (హిందీ), డ్రాకులా సర్ (బెంగాలీ) ఉన్నాయి.