సెలబ్రిటీలు అన్నాక పలు బ్రాండ్లకు ప్రచారకర్తలుగా ఉండటం సాధారణమే. వారి ఆదాయాల్లో ఇవే కీలకపాత్ర పోషిస్తాయి. గుచ్చి, ప్రదా, లూయిస్ వ్యూటాన్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉన్నారు పలువురు స్టార్స్. కొంతమంది మాత్రం నైతిక విలువలకు కట్టుబడి, ప్రకటనల్లో నటించడానికి ససేమిరా అంటున్నారు. కోట్ల రూపాయలు ఇస్తామన్నా వాటిని తిరస్కరించి, తమ విలువలకే కట్టుబడిన ఆ నటులు ఎవరు? ఎందుకు వద్దనుకున్నారు.
సాయి పల్లవి
దక్షిణాది కథానాయిక సాయిపల్లవికి ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా ఉంటే రూ.2 కోట్లు ఇస్తామన్నారు. అయినాసరే ఆమె ఒప్పుకోలేదు. అలా చేస్తే ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్లు అవుతుందన్న కారణంగా ఈ ప్రతిపాదనకు తిరస్కరించిందట ఈ భామ.
అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. వరుస చిత్రాలు చేస్తూ జోరుమీదున్నారు. ఎప్పుడూ అభిమానుల శ్రేయస్సును కోరుకునే అక్కీ.. ఓ పాన్ మసాలా యాడ్‌కు నో చెప్పి కోట్ల రూపాయల్ని వదులుకున్నారు.
అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ బిగ్‌బీ ప్రచారకర్తగా ఉన్న బ్రాండ్లు ఎన్నో. కానీ అవి ప్రజలకు ఉపయోగపడతాయంటే మాత్రమే అమితాబ్ ఆ యాడ్‌ను అంగీకరిస్తారు. అయితే ఓ సందర్భంలో ఈయన్ని కలిసి చిన్నారి.. కూల్‌డ్రింక్స్ విషం లాంటివి కదా. మీరెందుకు వాటికి ప్రచారకర్తగా ఉన్నారు అని ప్రశ్నించిందట. దీంతో అప్పటి నుంచి ఆ ప్రకటనే కాకుండా శీతల పానీయాల యాడ్లకు దూరంగా ఉన్నారు. తోటినటుల్ని అలాంటి ప్రచారాలు చేయొద్దని సూచిస్తున్నారట.
ఆమిర్ ఖాన్
బాలీవుడ్లో మిస్టర్ ఫర్ఫెక్ట్గా పేరు తెచ్చుకున్నారు ఆమిర్ ఖాన్. ఆ పేరు ప్రకారమే ఏది చేసినా ఫర్ఫెక్ట్గా చేస్తారు. ప్రకటనల విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే ఆమిర్ చాలా అరుదుగా యాడ్‌ల్లో నటిస్తుంటారు. అందులోని అది ఏదైనా సమాజ హితం ఉంటేనే ఒప్పుకుంటారు. నీటి సమస్యలు, భూతాపం, పోలియో ఇలాంటి వాటికే ప్రచారకర్తగా ఉండేందుకు ఇష్టపడతారు.
జాన్ అబ్రహం
బాలీవుడ్లో ఫిట్నెస్ ఎక్కువ ప్రాధాన్యమిచ్చే హీరోలలో జాన్ అబ్రహం ఒకరు. అందుకే ఆల్కహాల్, పొగాకు లాంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆ ఉత్పత్తులకు సంబంధించిన ప్రచారాల విషయంలోనూ ఆసక్తి చూపరు. అలాంటి యాడ్లు చేసేవారు తన దగ్గరికి రావద్దంటూ జాన్ ఎప్పుడో చెప్పేశారు.
రణ్‌బీర్ కపూర్
ఎప్పుడూ సహజ సౌందర్యానికే మొగ్గు చూపుతారు హీరో రణ్‌బీర్ కపూర్. అందుకే బ్యూటీ ప్రొడక్ట్స్‌కు ప్రచారం చేయడం, ప్రజలను మోసం చేసినట్లేనని భావిస్తారు. ఫలితంగా అలాంటి ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన ప్రేయసి ఆలియా భట్ మాత్రం ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్‌కు ప్రచారకర్తగా ఉంది.
కంగనా రనౌత్
రణ్‌బీర్ కపూర్ లాగానే కంగనా రనౌత్.. ఫెయిర్‌నెస్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన యాడ్లకు దూరంగా ఉంటారు. ఆ ప్రచారాలకు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా, నైతిక విలువలకు కట్టుబడి నో చెప్పారు. అలాగే బ్రాండ్ల విషయంలోనూ కంగనా చాలా కఠినంగానే ఉంటారు. ముందుగా సంస్థ బ్యాక్‌గ్రౌండ్ పరిశీలించిన తర్వాతే ప్రకటనల్లో నటించే విషయంపై గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.
అయితే పైవారందరూ వారి విలువలకు కట్టుబడి ప్రకటనలకు దూరంగా ఉంటే కొందరు మాత్రం అలాంటి వాటికి సై అంటున్నారు. హీరోయిన్ యామీ గౌతమ్, ఆలియా భట్ ఫెయిర్‌నెస్ క్రీమ్‌కు, అజయ్ దేవగణ్ పాన్ మసాలా ప్రకటనలు ఇస్తున్నారు. వీరే కాక షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, షాహిద్ కపూర్, సోనమ్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు ప్రకటనల్లో నటిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.