కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఫ్రంట్‌లైన్ వారియర్‌గా తప్పుడు గుర్తింపు కార్డును సృష్టించిందని 'బంగారం' నటి మీరా చోప్రా (Meera Chopra)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీకా కోసం నటి మీరా నకిలీ గుర్తింపు కార్డు సృష్టించారని ముంబయికి చెందిన భాజపా నేత నిరంజన్ పోస్టు చేయడం వల్ల నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై మీరాచోప్రా స్పందించింది. ఆ గుర్తింపుకార్డు తనది కాదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె పేర్కొంది.
ప్రియాంక చోప్రా వల్ల అవకాశాలు రావట్లేదు: మీరా
"మనం అందరం వ్యాక్సిన్ (Corona Vaccine) వేయించుకోవాలని కోరుకుంటున్నాం. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా నేను కూడా వ్యాక్సిన్ కోసం నాకు తెలిసినవాళ్ల సాయం కోరా. దాదాపు నెల రోజులుగా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా. మొత్తానికి వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నా. అందులో భాగంగానే ఆధార్‌కార్డు సమర్పించమనడం వల్ల దాన్ని పంపించా. అయితే.. ఆధార్‌ను మార్ఫింగ్ చేసి.. తప్పుడు గుర్తింపు కార్డు తయారు చేశారు. ఆ కార్డుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ఆధార్ కార్డు తప్ప మరే గుర్తింపు కార్డు లేదు. ఒకవేళ వేరే ఏదైనా గుర్తింపు కార్డు సమర్పిస్తే దానిపై మనం సంతకం చేస్తేనే అది చెల్లుతుంది. దానిపై నా సంతకం లేదు. ఇలాంటి తప్పుడు చర్యలను నేను పూర్తిగా ఖండిస్తున్నా. అసలు ఇలాంటి పనులు ఎందుకు చేస్తారో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నా" అని మీరా చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలోనూ ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) ఎవరో తనకు తెలియదని చెప్పి విమర్శలు ఎదుర్కొంది మీరా. నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra)కు వరుసకు సోదరి అయ్యే ఈమె 'బంగారం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇప్పుడు పలు బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లో నటిస్తోంది.