కరోనా పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా చిత్ర పరిశ్రమ స్తంభించిపోయినా.. కొత్త కథల తయారీ కొనసాగుతూనే ఉంది. చాలా మంది దర్శకులు ఈ విరామ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ పలువురు అగ్ర కథానాయకుల కోసం కొత్త కథలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారట. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం అదిరిపోయే కథ సిద్ధమైనట్లు సమాచారం. ఇంతకీ ఈ కథను చెక్కుతోన్న దర్శకుడు మరెవరో కాదు.. విభిన్న కథా చిత్రాలకు పెట్టింది పేరైన మారుతి.
బన్నితో ఓ మంచి చిత్రం చేయాలనేది మారుతికి మొదటి నుంచి ఉన్న కోరిక. ఒకరకంగా చిత్ర పరిశ్రమలో మంచి దర్శకుడిగా ఆయన స్థిరపడటం వెనక బన్ని అందించిన ప్రోత్సాహం ఎంతో ఉంది. కానీ, ఇన్నాళ్లు ఆయన అల్లు అర్జున్‌తో సినిమా చేయకపోవడానికి కారణం సరైన కథ దొరక్కపోవడమే. కానీ, ఇప్పటికి ఆయనకు సరిపడే చక్కటి పాయింట్‌తో ఓ అదిరిపోయే కథను సిద్ధం చేసుకున్నారట మారుతి. ఇప్పటికే ఈ కథను బన్నికి కూడా వినిపించాడని, పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని మరోసారి ఆయనకు వినిపించే పనిలో మారుతి ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఈ ప్రాజెక్టు ఓకే అయినా ఇది సెట్స్‌పైకి వెళ్లడానికి వచ్చే ఏడాది ఆఖరు వరకైనా వేచి చూడక తప్పదు. ఎందుకంటే దీని కన్నా ముందు బన్ని.. సుకుమార్, వేణు శ్రీరామ్‌ల చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది.