ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. కరోనా వైరస్ కారణంగా ఏడు నెలలుగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే చిత్రీకరణ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ మూవీని వచ్చే ఏడాది దీపావళి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసిందని సమాచారం. చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది.
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఐశ్వర్య, శరత్ కుమార్, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, అదితిరావు హైదరీ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్‌ని థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు అడవుల్లో చిత్రీకరించాల్సి ఉందట. అందుకే శ్రీలంక దేశంలో షూటింగ్ చేయడానికి చిత్రబృందం యోచిస్తుందని సమాచారం. సమారు నెలపాటు సాగే ఈ షెడ్యూల్ కోసం సెప్టెంబర్ 20న శ్రీలంకకు వెళ్తున్నారట. సుహాసిని మణిరత్నం, అలీరాజా సుభాస్కరన్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఏ.ఆర్.రెహమాన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.