బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మైదాన్'. ఈ ఏడాది అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల కావాలి. అయితే ఈ సినిమా ఓటీటీ వేదికగా 'పే పర్ వ్యూ' పద్ధతిలో విడుదల కానున్నట్లు కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఓటీటీ నిర్వాహకులతో దర్శక నిర్మాతలు గట్టిగా చర్చలు కూడా జరిపినట్లు అంతా మాట్లాడుకుంటున్నారు.
తాజాగా దీనిపై స్పందించిన ఈ చిత్ర నిర్మాతలు.. ఈ వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేసే యోచన లేనట్లు స్పష్టం చేశారు. ఏ ఓటీటీ ప్లాట్‌ఫాం నిర్వాహకులతో ఎటువంటి చర్చలు జరపలేదని తెలిపారు. ప్రస్తుతం తమ దృష్టంతా ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరి భద్రతను దృష్టిలో ఉంచుకుని సినిమా షూటింగ్‌ను పూర్తిచేయడమేనని వెల్లడించారు.
సయ్యద్ అబ్ధుల్ రహీం జీవితాధారంగా 'మైదాన్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1952 నుంచి 1963 మధ్య కాలంలో ఫుట్‌బాల్ క్రీడలో ప్రపంచ దేశాలపై అద్భుత ఆధిపత్యం ప్రదిర్శించింది భారత్. ఆ సమయంలో ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు రహీం.
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, జీ స్టూడియోస్ నిర్మాణ సంస్థ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. అజయ్ దేవగణ్‌తో పాటు ప్రియమణి, గజ్రాజ్ నటిస్తున్నారు. అమిత్ రవీందర్‌నాథ్ దర్శకుడు.
ఇదీ చూడండి: కరోనా దెబ్బ.. బడా సినిమాలదీ 'రాధే' దారే!