మాధవన్, సిమ్రన్ జంటగా నటిస్తోన్న చిత్రం 'రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్'. ఈ సినిమా విశేషాలను పంచుకొంటూ మంగళవారం ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్ చేశాడీ స్టార్ హీరో. దానికి కామెంట్‌గా ఓ యువతి నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.
"ఎడిటింగ్ చాలా కష్టంతో కూడుకున్న పని. మరోపక్క ఫన్నీగానూ ఉంటుంది. రోజంతా ప్రయాణం చేసొచ్చాను. నేను వృద్ధుడిని అయిపోతున్నాను".
-- మాధవన్, సినీ నటుడు
ఈ ఫొటోపై నైనా అనే నెటిజన్ కామెంట్ చేస్తూ... "నాకు 18 ఏళ్ల వయసు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకొంటున్నా. ఇది తప్పా..?" అని ప్రశ్నించింది. దానికి స్పందించిన హీరో... " గాడ్ బ్లెస్ యూ. నాకంటే మెరుగైన వ్యక్తి మీకు తప్పకుండా దొరుకుతాడు" అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.
ఈ విషయంపై అర్జున్ రెడ్డి నటి షాలిని పాండే కూడా స్పందించింది. " మీ వయసు పెరుగుతుంటే బాధగా ఉంది. కాని మీ నటన కోసం ఆతృతగా చూస్తున్నాం" అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అయితే "ఇంకా ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ వాడుతున్నావా" అని కామెంట్ పెట్టాడు.
ప్రముఖ మాజీ ఇస్రో శాస్త్రవేత్త 'నంబి నారాయణన్' జీవితం ఆధారంగా 'రాకెట్రీ' చిత్రం తెరకెక్కుతోంది. జాతీయ అవార్డు గ్రహీత అనంత్ మహదేవన్‌తో కలిసి సంయుక్తంగా దర్శకత్వ బాధ్యతలూ చేపట్టాడు మాధవన్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. దీనితో 'నిశ్శబ్ధం' అనే చిత్రంలో అనుష్కకు జోడీగా నటిస్తున్నాడు.