తెలుగు రాష్ట్రాలతోపాటు సినీ కార్మికులకు ఏ ఆపద వచ్చినా 'మా'(MAA) సభ్యులు వెంటనే స్పందిస్తారు. తలో చేయివేసి కోట్ల రూపాయలు పోగు చేస్తారు. అన్నార్థులను ఆదుకుంటారు. ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అసోసియేషన్‌కు వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. 'మా' ఏర్పడి 26 ఏళ్లు అయినా సరే నిధులు మాత్రం పెరగడం లేదు. ఇందుకోసం అధ్యక్షులుగా ఉన్నవారంతా తమ కాలపరిమితిలో కష్టపడుతున్నా, సభ్యుల అవసరానికి సరిపడా నిధులు అందడం లేదు. అయితే ఇంతమంది అగ్రహీరోలు ఉన్నప్పటికీ నిధుల కోసం 'మా' ఎందుకు ఇబ్బంది పడుతోంది? అసలు 'మా'లో ఏం జరుగుతోంది? కొన్నాళ్ల నుంచి 'మా' డైరీ విషయంలో తలెత్తుతున్న సమస్యేంటి?
'మా' ఏర్పాటు చేసినప్పుడు అగ్ర నటీనటులంతా విరాళాలతోపాటు పారితోషికాల్లోని కొంత భాగం, సినిమాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత అసోసియేషన్‌కు ఇచ్చేవాళ్లు. అలా.. 2015 నాటికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సుమారు రూ.3 కోట్ల రూపాయల నిధులు మాత్రమే ఉన్నాయి. వాటితో సభ్యుల సంక్షేమం, నూతన భవన నిర్మాణం సాధ్యమయ్యేది పనికాదు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లో ఎన్నో వినోద కార్యక్రమాలు, క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించినా ఆశించిన స్థాయిలో డబ్బు జమ అవ్వలేదు. గడిచిన ఆరేళ్లలో ముగ్గురు అధ్యక్షులుగా ఆ నిధిని పెంచేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రస్తుతం అసోసియేషన్‌లో నిర్వహణ ఖర్చులు, ఫించన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులు పోను రూ.5 కోట్ల లోపే నిధులు ఉన్నట్లు తెలుస్తోంది. అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నవారిలో చాలామంది కోటీశ్వరులు, లక్షాధికారులున్నారు. కానీ అసోసియేషన్‌లో పట్టుమని రూ.10 కోట్ల కూడా లేని పరిస్థితి.
అక్కినేని ప్రతిపాదన
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న క్రమంలో అసోసియేషన్‌కు ముఖ్య సలహాదారుడిగా ఉన్న అక్కినేని నాగేశ్వరరావు.. అప్పట్లోనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. సినీ పరిశ్రమలో ఉన్న నటీనటులంతా తమ పుట్టినరోజున అసోసియేషన్‌కు కొంత నగదును విరాళంగా ఇవ్వాలని కోరారు. ఎన్నోపుట్టిన రోజు అయితే అన్ని వందలు, వేలు, లక్షలైనా అసోసియేషన్‌కు ఇవ్వాలని సూచించారు. చెప్పడమే కాదు ఆయనే అసోసియేషన్‌కు మొదటి చెక్ ఇచ్చారు. అలా పోగైన నిధుల ద్వారా సభ్యుల సంక్షేమంతోపాటు వచ్చే తరంలో ఎన్నికయ్యే అధ్యక్షులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావని సూచించారు. అంతేకాకుండా ఒక్కో ఏడాది జమయ్యే నిధులతో భవిష్యత్తులో మంచి భవనం నిర్మించుకుందామని కూడా చెప్పారు. అక్కినేని సూచన పట్ల చాలా మంది నటీనటులు హర్షం వ్యక్తం చేశారు.
10 ఏళ్లలో రూ.30 లక్షలు.. విజయ నిర్మల విరాళం
దివంగత నటి, దర్శకనిర్మాత విజయనిర్మల ముందుకొచ్చి తన పుట్టిన రోజుకు అయ్యే ఖర్చులతోపాటు ప్రతి నెల రూ.15 వేలను అసోసియేషన్‌కు విరాళంగా అందజేసేవారు. చనిపోయే వరకు కూడా విజయనిర్మల అసోసియేషన్‌కు విరాళాన్ని ఇచ్చేవారు. అలా గత పదేళ్లుగా విజయనిర్మల.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సుమారు రూ.30 లక్షల వరకు పంపించారు. ఆ డబ్బుతో పేద కళాకారులకు వైద్య ఖర్చులు, మందుల కోసం కేటాయించమని ఆమె కోరేవారు.
జమున, గీతాంజలి..
విజయనిర్మలతో పాటు సీనియర్ నటి జమున కూడా తన పుట్టినరోజున మా అసోసియేషన్‌కు విరాళం ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అక్కినేని ప్రతిపాదనను ఆమోదిస్తూ తన ప్రతి పుట్టిరోజు కూడా క్రమం తప్పకుండా డబ్బులు పంపిస్తుంటారు. ఇప్పటి వరకు జమున మా అసోసియేషన్‌కు రూ.83 వేలు విరాళంగా అందించి అసోసియేషన్ పట్ల గౌరవాన్ని చాటుకున్నారు. నటి గీతాంజలి కూడా సీనియర్ల బాటలోనే నడుస్తూ తనకు తోచిన సహాయాన్ని పుట్టినరోజున పంపించేవారు. పేద కళాకారులకు ఆసరాగా ఉండేందుకు తోడ్పడేవారు. గీతాంజలి చనిపోయే వరకు కూడా 'మా' అసోసియేషన్‌కు ఆర్థిక సహాయాన్ని చేస్తుండేవారు. వీరితోపాటు మరికొంత మంది నటీనటులు ప్రతి ఏటా తమకు తోచిన సహాయం చేస్తూ అసోసియేషన్‌లో నిధుల లేమి లేకుండా ఆసరాగా నిలిచేవారు. ఇలా కొన్ని రోజులు అసోసియేషన్‌కు పుట్టినరోజు విరాళాలు బాగానే అందాయి. తర్వాత చాలా మంది ఇవ్వడం మానేశారు.
'మా' డైరీ వెనుక సంగతి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో నటీనటుల ఫోన్ నెంబర్లు, పుట్టినరోజు వివరాలతో డైరీ ముద్రించడం ఆనవాయితీగా వస్తుంది. 2009 నుంచి సంప్రదాయంగా డైరీ ప్రింట్ చేయడం అసోసియేషన్ ఆనవాయితీగా పెట్టుకుంది. ఆ డైరీని ప్రతి ఏటా అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్కరించి కృష్ణ, విజయనిర్మల దంపతులకు అందజేసేవారు. సాధారణ డైరీలతో పోల్చితే మా డైరీ ప్రత్యేకంగా ఉండటం సినీ పరిశ్రమను ఆకట్టుకునేది. స్పాన్సర్లు కూడా డైరీ ప్రింటింగ్‌కు ఆర్థిక సహాయాన్ని అందించేవాళ్లు. నగరంలోని ఆస్పత్రులు, బిల్డర్లు, వ్యాపార వేత్తలు స్పాన్సర్లుగా ఉండేవాళ్లు. కానీ గత ఆరేళ్ల నుంచి డైరీ విషయంలోనూ అసోసియేషన్‌లో గొడవలు మొదలయ్యాయి.
డైరీ స్పాన్సర్ల డబ్బులు అసోసియేషన్ ఖాతాలో జమ కావడం లేదని, డైరీ కోసం అసోసియేషన్ నిధుల నుంచి ఖర్చుపెడుతున్నారంటూ సభ్యులు బహిరంగంగానే ఆరోపించారు. ఒక్కో సంవత్సరం డైరీ ప్రింటింగ్ పేరుతో రూ.5 లక్షలు దుర్వినియోగం అవుతుందని అసోసియేషన్ కార్యవర్గంపై ఆరోపణలు వెల్లువెత్తేవి. డైరీ స్పాన్సర్లు తమ సంస్థల లోటు బడ్జెట్ చూపించడం వల్ల తప్పని పరిస్థితుల్లో అసోసియేషన్ నిధుల నుంచి ఖర్చు చేయాల్సి వచ్చేదని అధ్యక్ష కార్యదర్శకులు సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. గత రెండేళ్లలో అసోసియేషన్ ఫండ్ విషయంలో వివాదాలు చెలరేగడానికి మా డైరీకి కూడా కారణంగా నిలిచింది.
ఇవీ చూడండి..