మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'లూసిఫర్'. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పొలిటికల్ లీడర్ స్టీఫెన్ గట్టుపల్లిగా మోహన్‌లాల్ నటన ఆకట్టుకుంది. దీనికి కొనసాగింపు చిత్రం ఉంటుందని క్లైమాక్స్‌లో చెప్పేశారు.
ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కరోనా కారణంగా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీక్వెల్ చర్చలు మొదలైనట్లు సమాచారం. రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను మోహన్‌లాల్‌కు పృథ్వీరాజ్ వివరించారట. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా మారకముందు స్టీఫెన్ గట్టుపల్లి ఏం చేసేవాడు? ప్రపంచాన్ని శాసించే బంగారం, వజ్రాల మాఫియాకు స్టీఫెన్‌కు సంబంధం ఏంటి? అబ్రహం ఖురేషి.. స్టీఫెన్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? తెలియాలంటే 'లూసిఫర్2' చూడాల్సిందే.
మొదటి భాగం 'లూసిఫర్'ను తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. మోహన్‌రాజా ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఒకవైపు తెలుగులో మొదటి భాగం రీమేక్ అవుతుంటే మలయాళంలో సీక్వెల్‌ను మొదలు పెట్టే పనిలో ఉండటం విశేషం.
ఇదీ చూడండి: 'కేజీఎఫ్ 2' టీజర్: మాట నిలబెట్టుకుంటానంటున్న యశ్