చిత్రం: లవ్ ఆజ్ కల్
నటీనటులు: కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్, రణదీప్ హుడా, అరుషి శర్మ తదితరులు
సంగీతం: ప్రీతమ్, ఇషాన్ చబ్రా
సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్
ఎడిటింగ్: ఆర్తీ బజాజ్
నిర్మాత: దినేశ్ విజాన్, ఇంతియాజ్ అలీ
దర్శకత్వం: ఇంతియాజ్ అలీ
బ్యానర్: మ్యాడ్ డాక్ ఫిల్మ్స్, విండో సీట్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 14-02-2020
సైఫ్ అలీ ఖాన్, దీపిక పదుకొణె జంటగా ఇంతియాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం 'లవ్ ఆజ్ కల్'. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని సినీ ప్రేమికులు ఎవరూ మర్చిపోలేరు. దాదాపు పదేళ్ల తర్వాత అదే పేరుతో అదే దర్శకుడు రూపొందించిన చిత్రం 'లవ్ ఆజ్ కల్'. కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. గత మూడు చిత్రాలు విజయం సాధించడం వల్ల కార్తీక్ ఆర్యన్ జోరుమీదున్నారు. మరోవైపు 'సింబా', 'కేదార్‌నాథ్' చిత్రాల్లో తన అందంతో యువ ప్రేక్షకులను ఆకట్టుకుంది సారా. వీరిద్దరూ తొలిసారి జోడీగా నటించిన చిత్రం కావడం వల్ల ‘లవ్ ఆజ్ కల్’పై ఆసక్తి నెలకొంది. ‘జబ్ వుయ్ మెట్’, ‘లవ్ ఆజ్ కల్’, చిత్రాలతో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరుతెచ్చుకున్నారు ఇంతియాజ్. ఆయన నుంచి వస్తున్న మరో ప్రేమకథ కావడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
కథేంటంటే: వీర్(కార్తీక్), జో(సారా) టీనేజ్ వయసులో ప్రేమించుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరాక విడిపోతారు. మళ్లీ దగ్గరవుతారు. వీర్, జో అనే ప్రేమికుల ప్రణయ గాథ జీవితంలోని వివిధ దశల్లో ఎలాంటి ఒడుదొడుకులకు లోనైంది? వాటిని దాటుకుని వారు తమ ప్రేమని గెలిపించుకున్నారా? వారి ప్రేమ శాశ్వతంగా నిలిచిందా? 20-20 మ్యాచ్‌లా వేగంగా ఉరకలేసే నేటి యువతరం ప్రేమ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉన్నాయి?
ఎలా ఉందంటే: ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన 'జబ్ వుయ్ మెట్’', 'లవ్ ఆజ్ కల్' చిత్రాలు.. ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి. ఇతర భాషల్లోనూ రీమేక్ అయ్యాయి. తెలుగులో పవన్ కల్యాణ్‌తో 'తీన్‌మార్'గా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. సుమారు దశాబ్ద కాలం తర్వాత ఇంతియాజ్ అలీ ఎలాంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారా? అని చూడటానికి వెళ్తే.. అప్పుడు తీసిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్ర కథను మళ్లీ కొత్త నటులతో, నేటి తరానికి అన్వయించేలా తెరకెక్కించారంతే. అదే ప్రేమ, ఆ ప్రేమ వల్ల వచ్చే చిక్కులు, పరిణతి చెందని మనసులు, సరిగా లేని బంధాలను ప్రధానంగా చూపించిన దర్శకుడు వాటిని సమగ్రంగా కలిపే ప్రయత్నంలో తడబడ్డాడు. కథ మొత్తం చూస్తే, వీర్, జోయ్‌ల మధ్య గొడవలు, అది ప్రేమగా మారడం, కెరీర్‌లో ఉన్నతస్థాయికి వెళ్లడం.. చివరకు ఒకరి ప్రేమను ఒకరు అర్థం చేసుకుని కలుసుకోవడంతో సినిమా పూర్తవడం. వీరి ప్రేమ కథతో పాటు, రణ్‌దీప్ హుడా- ఆరుషి శర్మల ప్రేమ కథ కూడా సమాంతరంగా కనిపిస్తుంది. ఇంతకు మించి కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. దీంతో చాలా సన్నివేశాలు గతంలో చూసినట్లే అనిపిస్తాయి. సినిమా మొదలవగానే సులభంగానే కథంటో అర్థమైపోతుంటుంది. ప్రథమార్ధంలో అక్కడక్కడా సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. విరామం తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడికి ముందుగానే తెలిసిపోతుంది. దీంతో సినిమా అయిపోతే.. ఇంటికి వెళ్లిపోదాం అన్న భావన ప్రేక్షకుడిలో కలుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఎవరెలా చేశారంటే: కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ యువ ప్రేమికులుగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నటన పరంగా వారికి పేరు పెట్టడానికి ఏమీ లేదు. వీర్‌గా కార్తిక్ నటనలో పరిణతి కనిపిస్తుంది. అతని కెరీర్‌కు ఉపయోగపడే చిత్రం. రెండు విభిన్న షేడ్స్‌లో అతని నటన ఆకట్టుకుంటుంది. ‘జో’గా సారా కూడా అలరిస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ నోరేసుకుని పడిపోతుంటుంది. బహుశా ఇంతియాజ్ అలీ ఆ పాత్రను అలానే తీర్చిదిద్దాలనుకున్నాడేమో. తెరపై అందంగా కనిపించింది. ఆరుషి డైలాగ్‌లతో కన్నా తన హావాభావాలతో కట్టిపడేసింది. రణదీప్ హుడా నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, అతని పాత్ర ఇంకాస్త ఉంటే బాగుండేదేమోనని అనిపిస్తుంది. ముఖ్యంగా కార్తిక్-సారాల కెమిస్ట్రీ బాగుంది.
అద్భుతమైన కథకుడిగా ఇంతియాజ్ అలీకి పేరుంది. తనంటో గతంలోనే నిరూపించుకున్నాడు. అయితే, సమస్యల్లా పదేళ్ల కిందట తీసిన కథను మళ్లీ 2020లో కూడా ఆదరిస్తారని అనుకోవడం. వీర్, జో లాంటి పాత్రలు మనకు నిజ జీవితంలో ఎక్కడా కనిపించవు. కుటుంబ, ఉద్యోగ జీవితాన్ని మహిళలు సమన్వయం చేసుకోలేరన్న మాటకు ఎప్పుడో కాలం చెల్లింది. ఇప్పుడు వాళ్లు మల్టీటాస్కింగ్ చేస్తున్నారు. ఇంతియాజ్ అలీ ఈ విషయాన్ని గ్రహించి ఉంటే బాగుండేది. ప్రీతమ్ సంగీతం బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. అమిత్ రాయ్ ప్రతి ఫ్రేమును అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
+ నటీనటులు
+ పాటలు
బలహీనతలు
- తెలిసిన కథే కావడం
- దర్శకత్వం
చివరిగా: 2020 ప్రేమికుల కోసం మళ్లీ తీసిన ఆనాటి ‘లవ్ ఆజ్ కల్’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">