లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో(ఎల్ఐఎఫ్ఎఫ్) బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ఆర్టికల్ 15 చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. జూన్ 20న లండన్లో జరిగే 10వ వార్షికోత్సవంలో ప్రదర్శించేందుకు 25 సినిమాలను ఎంపిక చేశారు. ఇందులో 11 దక్షిణాసియా దేశాల చిత్రాలు, 6 యూకే సినిమాలున్నాయి.
భారత రాజ్యాంగంలోని 15వ అధికరణం ఆధారంగా ఆర్టికల్ 15 సినిమాను తీస్తున్నారు. "కులం, మతం, వర్ణం, లింగాల ఆధారంగా ఏ మనిషిపై వివక్ష చూపించరాదు" అనేది రాజ్యాంగంలోని 15వ అధికరణ సారాంశం. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్నారు.
భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, యూకే, యూఎస్, పోలాండ్ దేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శించనున్నారు. యూకేలో జరిగే ఈ కార్యక్రమాన్ని 23 వేదికల్లో ఐదు పట్టణాల్లో నిర్వహించనున్నారు. జులై 8వరకు ఈ కార్యక్రమం జరగనుంది.