కరోనాతో పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది. వెంటిలేటర్, ఎక్మో సాయంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ భాస్కరన్ బులెటిన్ విడుదల చేశారు.
బాల సుబ్రహ్మణ్యం స్పృహలోకి వచ్చారని, వైద్యానికి స్పందిస్తున్నారని బులిటెన్‌లో పేర్కొన్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యబృందం సునిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు.
ఆగస్టు మొదటివారంలో కరోనా బారిన పడటం వల్ల బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు, ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.