కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపడుతున్నాయి. ఈ పోరాటంలో పలువురు సినీప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. మహమ్మారి నియంత్రణకు వారి వంతు సహకారాన్ని అందించడానికి ముందుకొస్తున్నారు. గాయని లతా మంగేష్కర్, నటీమణులు ప్రియాంక చోప్రా, ఆలియా భట్, హీరో విక్కీ కౌశల్ మంగళవారం విరాళాలు ప్రకటించారు.
తన వంతు సహాయంగా రూ.25 లక్షలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ట్విట్టర్లో ప్రకటించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించటం మన బాధ్యతని.. ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా సాయం చేయాలని కోరిందీ గాయని.
- ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధులకు కోటి రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రముఖ కథానాయకుడు విక్కీ కౌశల్ ప్రకటించాడు.
- బాలీవుడ్ నటి కత్రినా కైఫ్.. ప్రధానమంత్రి సహాయనిధితో పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాన్నిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయనిధులకు సహకారాన్ని అందిస్తానని నటి ఆలియా భట్ తెలిపింది.
- కరోనాపై పోరాటంలో తన వంతు సహకారంగా కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు సైఫ్ అలీఖాన్ కుమార్తె, నటి సారా అలీ ఖాన్ ప్రకటించింది.
- నటుడు అలీ ఫజల్.. బ్యాట్‌మ్యాన్ ముసుగు ధరించి ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అందించాడు.
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1.50 లక్షలను విరాళంగా ప్రకటించింది మరాఠి నటి సాయి తమ్హాన్ కర్.
- విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్.. కేరళలోని కోవలం నగరానికి చెందిన 250 మంది నివాసాలు లేని కూలీలకు ప్రతిరోజు ఆహారాన్ని అందిస్తున్నాడు.
- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ప్రధానమంత్రి సహాయనిధి, యూనిసెఫ్, గూన్జ్, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్, నో కిడ్ హంగ్రీ, సాగ్-ఆఫ్ట్రాకు తాజాగా విరాళాన్ని ప్రకటించారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఇప్పటివరకు 1,251 మందికి కరోనా సోకగా.. ఈ మహమ్మారి బారిన పడి 32 మంది మరణించారు.
ఇదీ చూడండి.. బన్నీ స్టెప్పులకు ఫిదా అయిన బాలీవుడ్ భామ