దివంగత నటి శ్రీదేవి సినీవారసురాలిగా ఇప్పటికే ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా అదేబాటలో కథానాయికగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఖుషీ కపూర్ సినిమాల్లో ఎంట్రీపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె తండ్రి, ప్రముఖ చిత్ర నిర్మాత బోనీ కపూర్ స్పందించారు.
"మా చిన్నమ్మాయి(ఖుషీ కపూర్)ని చిత్రసీమకు పరిచయం చేయడానికి కావాల్సిన అన్నీహంగులు ఉన్నాయి. అయితే కథానాయికగా పరిచయం చేసేది మాత్రం నేను కాదు. కారణం ఏమిటంటే చిత్ర నిర్మాతగా నాకు, ఓ నటిగా ఖుషీకి ఇదేమంత మంచిది కాదు. ఎంత కుటుంబం చేయూత ఉన్నా.. ఇతర నటీమణుల్లాగే మా అమ్మాయీ సొంతంగా రాణించాలని కోరుకుంటాను. ఆ కారణంతోనే నేను ఆమెను తొలిసారిగా వెండితెరకు పరిచయం చేయడం లేదు".
- బోనీ కపూర్, బాలీవుడ్ నిర్మాత
ఖుషీ కపూర్.. ఇప్పటికే లండన్ ఫిలిం స్కూల్లో నటన కోసం శిక్షణ తీసుకుంది. ఆమె ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ.. తరచూ ఫొటోషూట్లలో పాల్గొని వాటిని అందులో పంచుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖుషీ కపూర్‌కు 3 లక్షల మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' టీజర్ విడుదలలో చిన్న మార్పు!