హిందీ చిత్రసీమలో మూవీ మాఫియాపై విమర్శలు చేస్తూ.. ముంబయిని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చి వివాదాల్లోకెక్కిన నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి నటి ఊర్మిళను సాఫ్ట్ పోర్న్ స్టార్ అంటూ కంగన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సోషల్‌మీడియాలో పలువురు ప్రముఖుల దగ్గర నుంచి కంగనపై పరోక్ష విమర్శలు వచ్చాయి.
టికెట్ పొందడం కష్టమేమి కాదు
ఇటీవలే ఓ టీవీ ఇంటర్వ్యూలో నటి ఊర్మిళను ఉద్దేశించి కంగన.. 'సాఫ్ట్ పోర్న్ స్టార్' అని పిలిచింది. రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటే తనకు టికెట్ దొరకడం కష్టమేమి కాదని కంగన అభిప్రాయపడింది. "ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్‌స్టార్. ఇది చాలా కఠినమైన పదమని నాకు తెలుసు. కానీ, ఆమెకు నటన కచ్చితంగా తెలియదు. ఆమె దేని వల్ల వెలుగులోకి వచ్చిందో అందరికి బాగా తెలుసు? సాఫ్ట్ పోర్న్ చేయడం వల్లే ఆమె తెలిసింది కదా! ఆమె టికెట్ పొందగలిగితే నాకు టికెట్ ఎందుకు రాదు?" అని ప్రశ్నించింది.
డ్రగ్స్ మూలమే ఆ రాష్ట్రం!
బాలీవుడ్‌ను డ్రగ్ మాఫియా అని కంగన చేసిన ఆరోపణల దగ్గర నుంచి వారిద్దరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. డ్రగ్స్ విషయంలో ఊర్మిళ స్పందిస్తూ.. "దేశమంతా మాదకద్రవ్యాల సమస్యను ఎదుర్కొంటోంది. డ్రగ్స్‌కు మూలం హిమాచల్ ప్రదేశ్ అని ఆమెకు తెలుసా? ముందు ఆ రాష్ట్రం నుంచే ఆమె ఈ ప్రచారాన్ని ప్రారంభించాలి" అని కంగనకు వ్యతిరేకంగా మాట్లాడింది ఊర్మిళ.
దీనిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా నిలిచారు. దర్శకనిర్మాత అనుభవ్ సిన్హా ఊర్మిళను ప్రశంసించారు. నటి స్వర భాస్కర్.. ఊర్మిళ నటించిన సినిమాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఊర్మిళకు మద్దతు లభిస్తున్న క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి కంగన ఓ ట్వీట్ చేసింది.