వెంకటేశ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి ఎందరో నటుల్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలుగు తెరకు పరిచయం చేశారు. తొలి చిత్రం ఆయనతో చేస్తే చాలు నటనలో పాస్ అయినట్టేనని భావించే హీరోహీరోయిన్లు ఎందరో ఉన్నారు. పైగా మాస్, క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల వారి అభిమానం ఒకే చిత్రంతో సంపాదించుకోవచ్చనే భావనా ఉంటుంది. అందుకే అగ్ర నిర్మాతలు, నటులు.. తమ వారసుల్ని వెండితెరకు పరిచయం చేసే ఆలోచన వచ్చిన వెంటనే రాఘవేంద్రరావును సంప్రదిస్తుంటారు. ప్రభాస్ విషయంలోనూ ఇదే జరిగింది. తనకు రాఘవేంద్రరావు సన్నిహితులు కావడం వల్ల ప్రభాస్‌తో ఓ చిత్రం చేయమని అడిగారట ప్రభాస్ తండ్రి. హీరో అయ్యేందుకు తగిన మెళకువలు నేర్చుకున్నాడని మీ దర్శకత్వంలోనే తొలి చిత్రం రావాలని కోరారట. కానీ, అది సాధ్యమవలేదు.
'ప్రభాస్‌ను నేనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నా. అప్పటికే నేను పలు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు' అని ఓ సందర్భంలో తెలియజేశారు రాఘవేంద్రరావు. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్‌లో సినిమా రాలేదు. భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి. దర్శకేంద్రుడికి కుదరకపోవడం వల్ల ఈ అవకాశం జయంత్ సి. పరాన్జీకి దక్కింది. ఆయనే ప్రభాస్‌ను 'ఈశ్వర్'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలా సాధారణ నటుడిగా వచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 'రాధేశ్యామ్', 'సలార్', 'ఆదిపురుష్'తోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.